ఏపీలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ ?
ఏపీలో అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సభ్యుల సంక్షేమం, ఇతర అంశాలపై అధ్యయనం చేసిన అసెంబ్లీ సదుపాయాల కమిటీ ఇవాళ ఓ నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఓ కీలకమైన సిఫార్సు చేసింది.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలోని అసెంబ్లీ సదుపాయాల కమిటీ రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతాల పెంపుతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్లను కూడా పెంచాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ కమిటీ తమ తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో సెప్టెంబర్ 25న జరిగిన సమావేశంలో తాము తీసుకున్న నిర్ణయాలను సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది.

వీటి ప్రకారం రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు కనీస జీతాలు,పెన్షన్ల పెంపు ఉండాలని అభిప్రాయపడింది. ఇందులో ముందుగా మణిపూర్, పంజాబ్, అరుణాచల్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాజీ ఎమ్మెల్యేలకు నెలకు 50 నుంచి 70 వేలు పెన్షన్ గా ఇస్తున్నారని, కాబట్టి మన మాజీ ఎమ్మెల్యేలకు కూడా ప్రస్తుతం ఉన్న 30 వేల నుంచి కనీసం 50 వేలకు, గరిష్టంగా 70 వేలకు పెన్షన్ పెంచాలని సిఫార్సు చేసింది.

అలాగే ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలకు అఖిల భారత సర్వీసు అధికారులతో సమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేలకు చివరిసారిగా 2016లో జీతాలు సవరించారని, కాబట్టి మారిన పరిస్ధితులకు అణుగుణంగా ప్రభుత్వమే వీరికి ప్రస్తుతం ఉన్న జీతాలను పెంచాలని, భత్యాలను హేతుబద్దం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. తమవైపు నుంచి మాత్రం ఎంత పెంచాలన్నది సిఫార్సు చేయలేదు. దీనిపై ప్రభుత్వం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications