ఎన్నికల బడ్జెట్ కు జగన్ సర్కార్ రెడీ ! మార్చి 14 నుంచి 10 రోజుల భేటీ ? మళ్లీ రాజధానుల బిల్లు ?
ఏపీలో ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. వచ్చే నెల 14 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
ఏపీలో వైసీపీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. అలాగే మరో రెండు నెలల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నికల ఏడాది ఎలాగో పూర్తిస్ధాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. ఇందులోనే మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ భేటీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్న ప్రభుత్వం.. వాటితో బడ్జెట్ పద్దు సిద్దం చేస్తోంది. వచ్చేనెల 14 నుంచి బడ్డెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బడ్జెట్ తో పాటు పలు కీలక బిల్లుల్ని ఆమోదింపచేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది.

10 రోజుల పాటు ఉండే ఛాన్స్
మార్చి 14న ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కనీసం 10 రోజుల పాటు ఉండేలా కనిపిస్తున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే సెషన్స్.. రెండో రోజు బీఏసీ సమావేశం తర్వాత అజెండా ఖరారు చేసుకుంటాయి. అనంతరం అజెండా ఆధారంగా బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారనేది తేలిపోనుంది. అనంతరం మరికొన్ని కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించవచ్చని తెలుస్తోంది. ఎన్నికల బడ్జెట్ గా భావిస్తున్న ఇందులో జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

మళ్లీ మూడు రాజధానుల బిల్లు ?
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం రెండు బిల్లుల్ని అసెంబ్లీలో గతంలో ఆమోదించిన సర్కార్ అనంతరం గవర్నర్ తోనూ ఆమోదముద్ర వేయించుకున్నా న్యాయస్దానాల్లో చుక్కెదురైంది. ఈ విషయం ముందే గ్రహించి బిల్లుల్ని వెనక్కి తీసుకుంది. వాటి స్దానంలో మరింత మెరుగైన బిల్లు తీసుకొస్తామని అప్పట్లో సీఎం జగన్ సభాముఖంగా ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో అసెంబ్లీలో మరోసారి బిల్లు పెట్టడంపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications