సీఎం జగన్ ఎన్నికల వరాలు -ఎమ్మెల్యేలకు లాస్ట్ మీట్, ముహూర్తం ఫిక్స్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీట్ల ఖరారు వేళ పార్టీల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్దులను దాదాపు ఖరారు చేసారు. ఒకటి, రెండు రోజుల్లోనూ తుది జాబితా ప్రకటనకు సిద్దం అవుతున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన జగన్..ఈ ఎన్నికల్లో కొత్త వరాల ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ప్రభుత్వ హాయంలో అసెంబ్లీ చివరి సమావేశాలకు రంగం సిద్దమవుతోంది.
ఓట్ ఆన్ అకౌంట్ : ఏపీలో ఎన్నికల వేళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. భీమిలి సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించిన జగన్ వచ్చే నెల 1న ఏలూరు, 3న అనంతపురంలో సిద్దం సభల నిర్వహణకు నిర్ణయించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అసెంబ్లీ నిర్వహణ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీని పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండదు. దీంతో, 2024 ఏప్రిల్ - జూన్ వరకు మూడు నెలలకు సంబంధించి బడ్జెట్ ను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ఫిబ్రవరి1న కేంద్రం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రతిపాదించనుంది.

ఎన్నికల వరాలు : కేంద్రం చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ కు తుది రూపు ఇవ్వనుంది. ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమవేశం లో ఎన్నికల వరాలకు సంబందించి కీలక నిర్ణయాలు ఉంటాయని అధికార వైసీపీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా రైతులకు రుణమాపీ, ఉద్యోగులకు ఐఆర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వంటి అంశాల పైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటుగా ఉద్యోగాల భర్తీ పైన నిర్ణయం ఉంటుందని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం మరోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రివర్గంలో, అసెంబ్లీ సమావేశాల్లోనూ తీసుకొనే నిర్ణయాల పైన ప్రస్తుతం చర్చ సాగుతోంది.

అధికారమే లక్ష్యంగా : జగన్ తన అయిదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం గురించి చివరి అసెంబ్లీ సమావేశాల్లో వివరించనున్నారు. అదే సమయంలో మరోసారి తాను అధికారంలోకి వస్తే ఏం చేయనుందీ ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలకు వచ్చే నెల షెడ్యూల్ విడుదల కానుంది. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా..సమావేశాలు జరిగే అవకాశం లేదు. దీంతో..31న మంత్రి వర్గ సమావేశం.. వచ్చే నెల 6వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications