AP Govt Schemes:పథకాల బ్రేక్‌పై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు..ఏ పార్టీకి ప్లస్..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ మాటల తూటాలు ఇరు ప్రధాన పార్టీల నుంచి బలంగా పేలుతున్నాయి. ఇక అందాల్సిన ప్రభుత్వ పథకాలపై ఈసీ జోక్యం చేసుకోవడంతో అవి నిలిచిపోయాయి. ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్లు ఇతరత్ర సామాజిక పింఛన్లు తీసుకునేందుకు వృద్ధులు మండుటెండలో బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది.పథకాల పంపిణీకి బ్రేక్ పడటం, పెన్షన్ల ఇబ్బందులు వీటన్నిటికీ ఎవరు కారణమనేది ఏపీ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇదే అంశం రేపు పోలింగ్ పై ప్రభావం చూపే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రభుత్వ పథకాలకు బ్రేక్ పడింది. ముందుగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ నిమ్మగడ్డ రమేష్ ఈసీకి ఫిర్యాదు చేయడంతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు చేయరాదంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇది మిగతా ప్రభుత్వ పథకాలకు వర్తించింది. జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలు పేదలకు చేరలేదు. దీనికి కారణం టీడీపీ చంద్రబాబే అని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇది టీడీపీ ఓటుపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈసీ ఆదేశాలతో తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సీడీ కూడా ఈసీ ఆదేశాలతో రాలేదు.మరోవైపు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న రైతులకు అందే సబ్సీడీ నిలిచిపోవడం, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే ఇది ఈసీ తప్పుగా ఎవరు చూడటం లేదు. టీడీపీ ఫిర్యాదు చేయడంతోనే ఇవన్నీ నిలిచిపోయాయనే అంశాన్ని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఇక పథకాలు పొందే గ్రామీణప్రాంత ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెలరోజులు ఓపిక పడితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్లీ పథకాలను ఇంటికి పంపిణీ చేస్తుందనే అంశాన్ని వైసీపీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళుతోంది. కొన్ని గ్రామాల్లో టీడీపీ కూటమి నేతలు ప్రచారంకు వెళ్లిన సమయంలో ప్రభుత్వ పథకాలు ఎందుకు నిలిపివేశారని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో నేతలు అవాక్కవుతున్నారంటూ సమాచారం అందుతోంది.
మొత్తానికి ప్రభుత్వ పథకాల పంపిణీ నిలిచిపోవడంతో ఆ పథకాల లబ్ధిదారులు ఇందుకు కారణం టీడీపీనే అని బలంగా నమ్ముతున్నట్లుగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఇది కచ్చితంగా టీడీపీకి మైనస్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.












Click it and Unblock the Notifications