ప్రధాని మోదీకి జగన్ మరో చేతావని-విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం
ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా ఉంటోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటును, దాని అనుబంధ భూములను వంద శాతం ప్రైవేటు చేతికి కట్టబెట్టాలన్న కేంద్ర సర్కారు నిర్ణయానికి స్థానిక జగన్ సర్కారు మరోసారి విముఖత తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం జరిగింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం చర్చకు రాగా..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి గురువారం శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోన్న సీఎం జగన్.. మోదీకి రాసిన లేఖలో 5 ప్రత్యామ్నాయ సూచనలు చేసిన విషయాన్ని కూడా మంత్రి మేకపాటి గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, స్టీల్‌ప్లాంట్ నష్టాల నుంచి బయట పడేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని మేకపాటి ఉద్ఘాటించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ.. విశాఖ ఉక్క- ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. 32 మంది ప్రాణాల బలిదానంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు అయ్యిందని, స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేంద్రం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలని కోరారు. కాగా,

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిబ్రవరిలోనే హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇవాళ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కాపీని కేంద్రానికి కూడా పంపుతారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications