అన్యాయం జరగదు - గుండెల్లో పెట్టుకుంటా: సీఎం జగన్ హామీ..!!
ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు..వారిని నేను కూడా చివరి వరకు అలాగే గుండెల్లో పెట్టుకుంటానని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మరో కీలక హామీ సీఎం జగన్ పూర్తి చేసారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా రెండు తీర్మానాలను ఆమోదించారు. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు.
అదే సమయంలో దళిత క్రిస్టయన్లను ఎస్సీల్లో చేర్చాలని శాసనసభ మరో తీర్మానం చేసింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నట్లు వెల్లడించారు.
తమను ఎస్టీ జాబితాలో చేర్చాలనిబోయ, వాల్మీకి కులాలు విజ్ఞప్తి చేసిన అంశాన్ని సీఎం జగన్ వివరించారు. వారికి అధికారంలోకి రాగానే మంచి చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసారు. మేనిపెస్టోలో పేర్కొన్న ప్రకారం బోయ, వాల్మీకిల స్థితిగతులపై అధ్యాయనం చేయించడానికి ప్రభుత్వం వన్ మెన్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు.
రిటైర్డు ఐఏఎస్ అధికారి శ్యామూల్ ఆనంద్‌కుమార్‌ను నియమించామని వివరించారు. ఈ కులస్థులు అధికంగా ఉండే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, వైయస్‌ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల్లో ఈ కమిషన్ విస్తృతంగా పర్యటించి ఆ కుటుంబాలపై ఆధ్యాయనం చేసిందన్నారు. వారి ఆర్థిక స్థితిగతులను పరిశీలించి నివేదిక తయారు చేసి..నివేదిక రూపంలో కమిషన్ సిఫార్సు చేసిందని వెల్లడించారు.

ఈ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని కేంద్రానికి సిఫార్స్ చేస్తూ అసెంబ్లీ ద్వారా పంపుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వానికి అందిన సిఫార్సులను పరిగణలోకి తీసుకొని కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేసినట్లుగా సీఎం వివరించారు. వీరికి ఎస్టీ హోదా కల్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా కొంత మంది షెడ్యూల్ ఏరియాల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
ఉద్యోగాలు, చదువులకు సంబంధించిన విషయాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎస్టీలపై ఎలాంటి ప్రభావం ఈ నిర్ణయం వల్ల జరుగదన్నారు. నాన్ జోనింగ్ ఉద్యోగాలపై మాత్రమే కొంత ప్రభావం ఉంటుందని చెప్పారు. షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజనులు, ఆదివాసులకు ఎలాంటి భంగం వాటిల్లదని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఒకరికి న్యాయం చేస్తున్నామంటే ఇంకొకరికి అన్యాయం చేస్తున్నట్లు కాదని వివరించారు.
అన్యాయం చేయాలనే అభిప్రాయం, ఉద్దేశం కానీ తనకు లేదని సీఎం జగన్ స్పష్టం చేసారు. ఎస్టీలకుఇసుమంతా కూడా అన్యాయం చేయనని హామీ ఇచ్చారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని రెండో తీర్మానం గురించి వివరించారు. ఇదే విషయంలో సుప్రీం కోర్టులో కేసు జరుగుతోందన్నారు. ఈ కేసులో ఏపీ తరఫున ఇంప్లీడ్ అయ్యి వాదన వినిపిస్తున్నట్లు చెప్పారు.
ఒక మనిషి మరో మతంలోకి వెళ్తే ఎవరికి అన్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కూడా కేవలం మత మార్పిడి వల్లే వీరికి రావాల్సిన ఎస్సీ హక్కులు రాకుండా పోవడం అన్యాయమని కచ్చితంగా నమ్ముతున్న సభగా ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ రెండు తీర్మానాల వల్ల ఈ సామాజికవర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం సరిదిద్దినట్లు అవుతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications