అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్.. టిడ్కో ఇళ్లపై తీపికబురు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేపట్టారు. సభ్యులు పలు సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తగా, మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశాలు వారం లేదా పది రోజులు కొనసాగే అవకాశం ఉంది.
ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు...
ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ, అలాగే ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆర్డినెన్స్-2025 స్థానంలో బిల్లులు వచ్చే అవకాశం ఉంది.

టిడ్కో ఇళ్ల నిర్మాణం
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ₹6,300 కోట్లు అవసరమని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం ₹3,664 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆగిపోయిన గృహ సముదాయాలను పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించామని తెలిపారు.
రైతుల సమస్యలపై చర్చ
రైతుల సమస్యలపై వైకాపా సభ్యులు శాసనమండలిలో నినాదాలు చేశారు. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, యూరియా సహా అన్ని వ్యవసాయ సమస్యలపై ఎన్ని గంటలైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైకాపా నేతలకు హితవు పలికారు.
ప్రతిపక్షంపై విమర్శలు
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అవినీతి బయటపడుతుందనే భయంతో వైకాపా సభ్యులు సభకు రాకపోతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు వైకాపాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని సొంత మీడియాతోనే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా జగన్ పనికిరరని ప్రజలు తేల్చేశారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, "అన్ని సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష హోదా లేదనే కారణంతో అసెంబ్లీకి రాకపోవడం సరికాదు" అన్నారు.
వైకాపాపై మండిపడిన ఎమ్మెల్సీలు
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, మెడికల్ కాలేజీల కోసం గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. వైకాపా తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. మరో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ, ప్రజలు వైకాపా అరాచకాలకు విసిగి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. "అసత్యాలతో ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు?" అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications