అసెంబ్లీ అజెండా, బడ్జెట్ పై తాజా నిర్ణయం..!!
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై బీఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం తో మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొత్తం 15 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో సమావేశాల అజెండా.. పది దినాల పైన చర్చించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు అజెండా అంశాలు పెంచాలని కోరారు. కాగా, మార్చి 21వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించగా.. ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనుంది.
15 పని దినాలు
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో సమావేశాల నిర్వహణ పైన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. రేపు (శుక్రవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పై చర్చ జరగనుంది. అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. 26, 27 సభకు సెలవు ప్రకటించారు. 28న ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనుంది. మార్చి 3వ తేదీ నుంచి బడ్జెట్ పైన చర్చ ప్రారంభం కానుంది. మార్చి 19వ తేదీతో బడ్జెట్ పైన చర్చ ముగించాలని నిర్ణయించారు. మరో రెండు రోజులు రిజర్వ్ డేస్ గా ఖరారు చేసారు. అవసరమైతే మార్చి 20,21 తేదీల్లో సభ నిర్వహించనున్నారు.

సభలో చర్చ కోసం
ఇక, బీఏసీ సమావేశంలో సభలో ప్రవేశ పెట్టే బిల్లులు.. చర్చించాల్సిన అంశాల పైన చర్చ జరిగింది. మరిన్ని అంశాల పైన చర్చ చేయాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రాజు ప్రతిపాదించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ బిల్లులతో పాటుగా మొత్తం 24 అంశాలను అధికారపక్షం సిద్ధం చేసింది. ఇందులో ప్రధానంగా 8 నెలల ప్రభుత్వ విజయాలు, పోలవరం-బనకచర్ల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి, రహదారుల నిర్మాణం మరమ్మతులు, ఆర్ అండ్ బి, దావోస్ పర్యటన, పెట్టుబడులు యువతకు ఉపాధి, స్వర్ణాంధ్ర విజన్ 2047, ఇండస్ట్రీయల్ పాలసీ, ఐటీ పాలసీ వంటి అంశాలు ఉన్నాయి.

కీలక అంశాల పై
అదే విధంగా గత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కుంభకోణాలు, అటవీ భూములు, మఠ భూములు, రెవిన్యూ భూములు కబ్జా, మద్యం కుంభకోణం, కాకినాడ పోర్టు కుంభకోణం, అటవీ భూముల కుంభకోణం వంటి అంశాలపైనా చర్చించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక, రాష్ట్రంలో పెండింగ్ బకాయిలు-చెల్లింపు, వాట్సాప్ గవర్నన్స్ 161 సేవలతో మన మిత్ర, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లింపులు, విద్యారంగం బలోపేతానికి చర్యలు, రెవెన్యూ సద స్సులు పరిష్కరించిన అంశాలు వంటి అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ వారం అయిదు రోజుల పాటు సభ నిర్వహణకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications