మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్-ఈసారి సెషన్ మొత్తానికి-నలుగురు ఎమ్మెల్యేలపై
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు ప్రతీ రోజూ సభలో నిరసనలకు దిగడం, ప్రభుత్వం స్పీకర్ సాయంతో సస్పెండ్ చేయడం సర్వసాధారణమవుతోంది. జంగారెడ్డిగూడెం మరణాలతో పాటు పెగాసస్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ కూడా తమ నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.
ఇవాళ సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేల్లో బెందాళం అశోక్, రామరాజు, సత్యప్రసాద్, రామకృష్ణ ల ఉన్నారు. వీరిపై ఈ సెషన్ ముగిసేవరకూ సస్పెన్షన్ వేటు పడింది. సభకు పదేపదే ఆటంకం కలిగించడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. స్పీకర్ ఎంత వారించినా వారు వినలేదు. దీంతో పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా చేశారు. దీంతో తమ స్ధానాలకు వెళ్లి అక్కడి నుంచే నినాదాలు చేశారు. దీంతో నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది.

ఈ నెల 25వరకూ అంటే బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ ఈ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడింది. దీంతో ఈ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను ఇప్పటివరకూ రోజువారీ సస్పెండ్ చేస్తున్న స్పీకర్.. తొలిసారి సెషన్ ముగిసేవరకూ సస్పెండ్ చేసినట్లయింది. జంగారెడ్డి గూడెం ఘటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరసనలకు టీడీపీ సభ్యులు ముందే ప్రిపేర్ అయి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్పీకర్ కూడా వీరిని సెషన్ ముగిసేవరకూ సస్పెండ్ చేసి షాకిచ్చారు.












Click it and Unblock the Notifications