నకిలీ విద్యార్హతల వివాదంలో స్పీకర్ తమ్మినేని ? రాష్ట్రపతి, సీజే,గవర్నర్లకు టీడీపీ ఫిర్యాదు..
అమరావతి : ఏపీ అసెంబ్లీ (ap assembly) స్పీకర్ తమ్మినేని సీతారాం (tammineni sitaram) విద్యార్హతల వివాదంలో చిక్కుకున్నారు. డిగ్రీ పూర్తి చేయకుండానే చేసినట్లు విద్యార్హతలు సమర్పించి లా కోర్టులో అడ్మిషన్ పొందారని ఆయనపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి, సీజేఐ,గవర్నర్ తో పలువురికి ఫిర్యాదులు చేసింది.
గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్పొందారంటూ తమ్మినేని సీతారాంపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధారాలు బయటపెట్టారు. ఈ వ్యవహారాన్ని భారత రాష్ట్రపతికి, తెలంగాణ, ఏపీ గవర్నర్లకు, సీఎం జగన్ కూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. తమ్మినేనిపై తగు చర్యలు తీసుకోవాలని కూన కోరారు.

2019-20 విద్యాసంవత్సరంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హైదరాబాద్ ఎల్పీనగర్ లో ఉన్న ఉస్మానియా యూనివర్శిటీ అఫిలియేటెడ్ మహాత్మాగాంధీ లా కాలేజ్ ఆడ్మిషన్ పొందినట్లు కూన రవికుమార్ తన ఫిర్యాదులో తెలిపారు. ఈ అడ్మిషన్ కు డిగ్రీ లేదా సమాన విద్యార్హత తప్పనిసరని ఆయన వెల్లడించారు. కానీ స్పీకర్ తమ్మినేని 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డిగ్రీ పూర్తి చేయలేదని తెలిపారని, ఇదే విషయం ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూలోనూ చెప్పారని కూన వెల్లడించారు.
మహాత్మాగాంధీ లా కాలేజీ యాజమాన్యం తమ్మినేని లాంటి హైప్రొఫైల్ వ్యక్తులకు మూడేళ్ల లాకోర్సు అడ్మిషన్ కు ఏమైనా మినహాయింపు ఇచ్చారా అని కూన ప్రశ్నించారు. తమ్మినేని కేవలం ఆముదాలవలస ఎమ్మెల్యే మాత్రమే కాదని, అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల్ని నడిపించే స్పీకర్ కూడా అని ఫిర్యాదులో తెలిపారు. కాబట్టి గౌరవ ప్రదమైన స్ధానంలో ఉంటూ నకిలీ విద్యార్హతలతో లాకోర్సు అడ్మిషన్ పొందిన తమ్మినేనిపై తగిన చర్యలు తీసుకోవాలని కూన రాష్ట్రపతి, గవర్నర్లు, సీఎం, సీజేఐకి రాసిన లేఖల్లో కోరారు.












Click it and Unblock the Notifications