ఎపి రాజధాని ఇష్యూ: అసెంబ్లీలో ఆందోళన, స్తంభన
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అంశంపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. రాష్ట్ర రాజధాని ఎక్కడనే విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రకటనకు ముందే సభలో చర్చించాలని పట్టుబడుతూ వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు ఆందోళనకు దిగారు.
స్పీకర్ ఎంతగా సర్దిచెప్పినా వారు వినలేదు. చర్చ, ఓటింగ్ జరిగిన తర్వాతనే రాష్ట్ర రాజధాని ఎక్కడనే విషయం ప్రకటించాలని వైయస్ జగన్ మరోసారి పట్టుబట్టారు. రాజధాని అంశంపై గతంలో ఐదు రోజులు చర్చ జరిగిందని, ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చిస్తే ఏ విధమైన ఫలితం ఉండదని ఆయన అన్నారు.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసన వ్యాఖ్యపై వైసిపి సభ్యుడు జ్యోతుల నెహ్రూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తాను అభ్యంతకరమైన వ్యాఖ్యలు ఏవీ చేయలేదని యనమల స్పష్టం చేశారు. సభను మీ చేతుల్లోకి తీసుకుంటే మంచిది కాదని ఆయన అన్నారు. ఇడుపులపాయ కాదని, ఇది అసెంబ్లీ అని ఆయన అన్నారు.

ప్రతిపక్షం చెప్పినట్లే సభ నడవాలంటే కుదరదని యనమల అన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అయినా, ప్రతిపక్ష నేత అయినా నిబంధనలకు అతీతులు కారని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటే వైసిపి చర్చలో పాల్గొనాలని ఆన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. స్వార్థ రాజకీయాలతో జగన్ సీమాంధ్రలో చిచ్చుపెడుతున్నారని ఆయన విమర్శించారు. రాజధానిపై వైసిపికి స్పష్టత లేదని ఆయన అన్నారు. వైసిపి నేతలు భూములు కొన్న ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలంటే కుదరదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత సలహాలు, సూచనలు చేయవచ్చునని స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెప్పినా వైసిపి సభ్యులు పట్టించుకోలేదు.
రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలని జగన్ అనుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు అనుకూలంగా ఉండే చోట రాజధాని ఏర్పాటవుతుందని ఆయన అన్నారు. వైసిపి నేతలు భూములు కొన్న చోట రాజధాని ఏర్పాటు చేయాలంటే జగన్ తరమే కాదు జగన్ బాబు తరం కూడా కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రకటనను వైసిపి స్వాగతించాలని ఆయన అన్నారు. ప్రకటన తర్వాత సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
తిరిగి సమావేశమైన తర్వాత సభ సద్దుమణగలేదు. దాంతో స్పీకర్ సభను మరోసారి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications