ఏపీ అంతటా బంద్: నిలిచిన బస్సులు, మంగళగిరి ఎమ్మెల్యే అరెస్ట్
అమరావతి: విభజన చట్టం అమలులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు వామపక్షాలు మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏపీ బంద్‌కు వైసీపీ, కాంగ్రెస్‌లు విడివిడిగా పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారకముందే రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన ఆయా పార్టీలకు చెందిన నేతలు ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. దీని ఫలితంగా పలు ప్రాంతాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. బంద్ కారణంగా 8 బస్ డిపోల్లోని 912 బస్సులు నిలిచిపోయాయి.

నూజివీడులో బస్టాండ్‌కే బస్సులు పరిమితమయ్యాయి. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో బంద్ పాక్షికంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని బస్టాండ్ ఎదుట వామపక్షాలు ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే బంద్ కారణంగా రంగంలోకి దిగిన పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు.
దీంతో పలు ప్రాంతాల్లో తెల్లవారకముందే ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాగా, తిరుమలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించరాదన్న భావనతో తిరుపతి నుంచి తిరుమల బయలుదేరే బస్సులను మాత్రం ఆందోళనకారులు అడ్డుకోవడం లేదు. దీంతో తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సులు యథాతథంగా తిరుగుతున్నాయి.
కాగా, మంగళవారం వైసీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ యూనియన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్లు ప్రత్యేక హోదా డిమాండ్‌తో అన్ని డిపోల వద్ద ధర్నాలు, నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.
వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు కూడా ప్రత్యేక హోదా సాధనకు జరిగే బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ బంద్ విజయవంతం చేసేందుకు ఆయా పార్టీల నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ బంద్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు సిద్ధమయ్యాయి.
మంగళగిరి ఎమ్మెల్యే అరెస్ట్
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఉదయం నుంచే వైసీపీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. ఉదయం 5 గంటలకే బస్టాండ్ వద్దకు చేరుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలు డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.

దీంతో గుంటూరు-విజయవాడ రహదారిపై వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా రాజధాని సచివాలయం వెలగపూడికి వెళ్లె బస్సులన్నీ నిలిచిపోయాయి. దాదాపు 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో మంగళగిరి స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు తొమ్మిది మంది పార్టీ నేతలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు బంద్‌కు సహకరించాలని కోరుతూ పట్టణంలో స్థానిక యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.