నిజాం ఆస్తి, ఎపి భవన్ తెలంగాణదే: ఇది కెసిఆర్ మాట
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వంద శాతం నిజాం ఆస్తేనని, ఇందులో ప్రశ్నలకు తావే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ హౌస్ అని ఇంటర్నెట్‌లో వెతికినా దీని చరిత్ర మొత్తం వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆస్తి ఎక్కడ ఉన్నా చట్టంలో ఉన్న ప్రకారం పంపిణీ చేయాల్సిందేనన్నారు.
అయితే, హైదరాబాద్‌లో ఉన్న నిజాం ఆస్తుల్ని, ఆంధ్రాలో గతంలో కట్టినవి, ప్రపంచ వ్యాప్తంగా నిజాం కట్టించిన అంచనాలకు అందని ఆస్తులు మక్కాలోను, అజ్మీర్‌లోను, సౌదీ అరేబియాలోను ఉన్నాయని వాటిని పంపిణీ చేయటం కుదరదన్నారు.

చరిత్రను వక్రీకరించటం కుదరదని, ఎవరి ఆస్తులు వారు తీసుకోవాలే తప్ప ఇతరుల ఆస్తులు కావాలనటం విజ్ఞత కాదని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లో 180 పోస్టుల వరకూ ఉండేవని, ఇప్పుడు మాత్రం 70-80 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని చెప్పారు.
వీరిలో కొందరు ఆంధ్రావాళ్లను తెలంగాణకు, తెలంగాణ వాళ్లను ఆంధ్రాకు కేటాయించారని.. ఇదంతా కాకుండా ఆంధ్రావారిని ఆంధ్రాకు, తెలంగాణ వారిని తెలంగాణకు కేటాయించి, మిగతా వాళ్లకు ఆప్షన్లు ఇవ్వాలని, అయినప్పటికీ పోస్టులు ఖాళీగా ఉంటాయని, వాటిని ఆయా రాష్ట్రాలే భర్తీ చేసుకుంటాయని తెలిపారు.












Click it and Unblock the Notifications