పవన్ మైండ్ గేమ్ కామెంట్స్ పై సోము రియాక్షన్- అదే అదనుగా చంద్రబాబుపై
ఏపీలో పలు పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని, అందులో పావులు కావొద్దంటూ జనసేన కార్యకర్తలకు నిన్న పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీనిపై రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆ కామెంట్స్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించే చేశారంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన మిత్రపక్షం బీజేపీ దీనిపై స్పందించింది.
విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ కామెంట్స్ పై స్పందించారు. మా మిత్రపక్షం నాయకులు నిన్న కార్యకర్తల సమావేశంలో మైండ్ గేమ్ రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయని ప్రస్తావించారని సోము గుర్తు చేశారు. అలాంటి మైండ్ గేమ్ రాజకీయాలకు బీజేపీ చెక్ పెడుతుందంటూ హెచ్చరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది మోదీనే అని, ఏపీని అభివృద్ధి చేయటానికి బీజేపీ, జనసేన ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని వీర్రాజు తెలిపారు.

విపక్షంలోని జనసేనతో పాటు బీజేపీతో పొత్తు కోసం టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై గతంలోనూ సోము చాలాసార్లు స్పందించారు. వైసీపీ, టీడీపీ ఇద్దరినీ ఒకే గాటన కట్టారు. వీరిద్దరితో సమదూరం పాటిస్తామన్నారు. కానీ టీడీపీ మాత్రం జనసేనపై ఆశలు వదులుకోవడం లేదు. దీంతో జనసేనను తాము లవ్ చేస్తున్నా ఆ పార్టీ స్పందించడం లేదంటూ చంద్రబాబు తాజాగా వాపోయారు.
ఈ నేపథ్యంలో రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ దీన్ని మైండ్ గేమ్ గా అభివర్ణించారు. దీనిలో పావులుగా మారొద్దని జనసైనికులకు సూచించారు. ఇప్పుడు ఇదే సాకుగా మైండ్ గేమ్ రాజకీయాలకు బీజేపీ చెక్ పెడుతోందంటూ చెప్పడం ద్వారా చంద్రబాబుకు సోము వీర్రాజు హెచ్చరికలు పంపినట్లయింది.












Click it and Unblock the Notifications