ఏపీలో బీజేపీ రథయాత్రకు బ్రేక్- మారిన వ్యూహం- కారణమిదే
ఏపీలో వరుసగా జరుగుతున్న ఆలయాల ఘటనలకు వ్యతిరేకంగా రథయాత్ర చేపట్టాలని బీజేపీ గతంలో నిర్ణయించింది. ఫిబ్రవరి 4న తిరుపతిలోని కపిల తీర్ధం నుంచి విజయనగరం జిల్లా రామతీర్దం వరకూ బీజేపీ-జనసేన కలిసి రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం అనుమతి ఇవ్వాలని పోలీసులను కూడా కోరారు. అయితే చివరి నిమిషంలో మాత్రం యాత్రకు బ్రేక్ పడింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నాలుగు దేశల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు యాత్ర పేరుతో నేతలు రాష్ట్ర పర్యటన చేస్తే ఎన్నికల వ్యూహాలకు విఘాతం కలుగుతుంది. దీంతో ఫిబ్రవరి 4న ప్రారంభం కావాల్సిన రథయాత్రను వాయిదా వేసుకుంటన్నట్లు బీజేపీ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ యాత్ర చేపట్టే అవకాశముందని నేతలు చెప్తున్నారు.
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా రథయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

ఏపీలో వరుస విగ్రహాల ఘటనల తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ-జనసేన కలిసి రథయాత్రకు ప్లాన్ చేశాయి. ఇందులో భాగంగా కపిల తీర్ధం నుంచి రామతీర్ధం వరకూ యాత్ర నిర్వహిస్తామని చెప్పిన బీజేపీ నేతలు పోలీసు అనుమతి కూడా కోరాయి. అసలు ఈ యాత్రకు పోలీసులు అనుమతిస్తారో లేదో అన్న ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలోనే కాషాయ నేతలు వాయిదా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం లేకపోవడం వల్లే బీజేపీ ఈ యాత్రకు ప్లాన్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది.