గ్లోబల్ సూపర్ స్టార్ షకీరా మెరుపులు- ఈ రాత్రికే.. టెలికాస్ట్ ఛానల్స్ ఇవే!!
ఫుట్ బాల్ ప్రపంచాన్ని ఫిఫా ఫీవర్ అలముకుంది. సాకర్ మేనియా చుట్టుముట్టింది. ఫీఫా ప్రపంచకప్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. ఫుట్‌బాల్ లో వరల్డ్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. కళ్లు చెదిరేలా ఈ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ఓపెనింగ్ లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గ్లోబల్ పాప్ స్టార్ షకీరా సిద్ధమయ్యారు. మెక్సికో సిటీలో జరగనున్న ఈ అట్టహాసమైన ప్రారంభోత్సవ వేడుక కోసం ఆమె రిహార్సల్స్ చేస్తోన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
తోటి డ్యాన్సర్లు, టెెక్నికల్ టీమ్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను ఆమె విడుదల చేశారు. గత వారం అంతా రిహార్సల్స్‌తో చాలా బిజీగా గడిపామని తెలిపారు. ఇప్పుడు ఎలక్ట్రిఫయింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ప్రారంభ వేదికపై అభిమానులందరినీ కలిసేందుకు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోన్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందబోయే మ్యూజిక్ ఫెస్టివల్స్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫిఫా వరల్డ్ కప్ అఫీషియల్ సాంగ్ డై డై (Dai Dai)పై షకీరా స్టేజీ మీద పెర్ఫార్మ్ చేయనున్నారు. నైజీరియన్ సంగీత కళాకారుడు బర్నా బాయ్‌తో కలిసి అదరగొట్టనున్నారు. ఈ పాటను లైవ్‌లో వినిపించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కూడా ఈ ఫీఫా అఫీషియల్ సాంగ్ ను అధికారికంగా ఎక్కడే గానీ వినిపించలేదు నిర్వాహకులు. ఇదే హైలైట్ కానుంది. ఈ మ్యూజికల్ ఈవెంట్ లో పలువురు ప్రపంచ స్థాయి కళాకారులు పాల్గొననున్నారు.
మెక్సికో సిటీ వేదికగా జరగనున్న ఈ వేడుకలో అలజాండ్రో ఫెర్నాండెజ్, బెలిండా, డానీ ఓషన్, జే బాల్విన్, లీలా డౌన్స్, లాస్ ఏంజెల్స్ అజులెస్, మనా, టైలా వంటి ప్రముఖులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వీరితో పాటు, జే బాల్విన్‌తో కలిసి ర్యాన్ కాస్ట్రో కూడా పాల్గొంటారని ఫిఫా ధృవీకరించింది. హాలీవుడ్ నటి సల్మా హేయక్ పినాల్ట్ ఈ టోర్నమెంట్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
పోటీ ప్రారంభానికి ముందు రెండు ప్రత్యేక సంగీత క్షణాలను అభిమానులు వీక్షించవచ్చు. మెక్సికో జాతీయ గీతాన్ని అలజాండ్రో ఫెర్నాండెజ్, దక్షిణాఫ్రికా జాతీయ గీతాన్ని గాయని టైలా ఆలపించనున్నారు. 'డై డై' గీతం ఫిఫా గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ ప్రచారంలో భాగంగా రూపొందించారు. టోర్నమెంట్ ముగిసేలోపు 100 మిలియన్ డాలర్ల నిధిని సేకరించి, ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు విద్య, ఫుట్‌బాల్ అవకాశాలు కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.
ఈసారి టోర్నీ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుంది. మొత్తం 48 జట్లు, 104 మ్యాచ్‌లతో మెక్సికో, కెనడా, అమెరికా వేదికలుగా ఈ పోటీలు జరగనున్నాయి. మూడు దేశాల్లో వేడుకలు ప్లాన్ చేయగా, మెక్సికో సిటీలో జరగబోయేది అత్యంత ప్రధానమైనది. తొలి మ్యాచ్‌కు 90 నిమిషాల ముందు ప్రారంభమయ్యే ఈ వేడుక సుమారు 16 నిమిషాల 30 సెకన్ల పాటు సాగనుంది. భారత్‌లో రాత్రి 11 గంటల నుంచి యునైట్8 స్పోర్ట్స్ ఛానల్స్, జీ5 (Zee5) వేదికగా ఈ ప్రారంభ వేడుకను వీక్షించవచ్చు.













Click it and Unblock the Notifications