జనసేనతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ హైకమాండ్: విష్ణు నోట పలికించిన మాట
Janasena: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖారావాన్ని పూరించారు. రణభేరిని మోగించారు.
అటు అభ్యర్థుల ఎంపికలోనూ ముందే ఉంది వైఎస్ఆర్సీపీ. ఇప్పటికే నాలుగు విడతల్లో 68 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయిదో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తును పూర్తి చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఈ జాబితా వెలువడొచ్చు.

తెలుగుదేశం పార్టీ- జనసేన తమ ఉమ్మడి అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. దీనికి సన్నాహకంగా రా.. కదలిరా సభా వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ వస్తోన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
ఈ పరిస్థితుల్లో ఏపీ బీజేపీ.. జనసేనపై ఆశలను పెట్టుకుంది. జనసేనతో పొత్తు కొనసాగుతుందంటూ బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ-జనసేన పొత్తుపై గతంలో కూడా క్లారిటీ ఇచ్చామని, ఇప్పుడూ అదే చెబుతున్నామని అన్నారు.
ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందని, భవిష్యత్తులో కూడా వాస్తవరూపం దాల్చుతుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బిహార్, మహారాష్ట్రల్లో బీజేపీ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.

బీజేపీతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని బలంగా విశ్వసిస్తోన్న ఇతర కూటముల్లోని పార్టీలు, నాయకులు.. బయటికి వస్తోన్నారని పేర్కొన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ఏపీలో కూడా బీజేపీ-జనసేన ప్రత్యామ్నాయ పార్టీగా ఆవిర్భవిస్తాయని చెప్పారు.
జనసేనతో పొత్తు సహా అన్ని విషయాలపైనా పార్టీ హైకమాండ్ సరైన సమయంలో సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏపీలో కూడా బీజేపీతో కూడిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే ఏర్పడుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీలో అభివృద్ధి చెందడం అసాధ్యమనీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications