జగన్ సర్కారుకు అప్పు ఇచ్చింది వీళ్లే -లిస్టు బయటపెట్టిన కేంద్రం -రూ.56వేల కోట్లు -సీఎంకు జైలు ఖాయమంటూ
'అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్' అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యతిరేకులు చాలా రోజులుగా చేస్తోన్న విమర్శలకు మరింత బలం చూకూరేలా ఆ విషయాన్ని కేంద్రంలోని మోదీ సర్కారు పదే పదే నిర్ధారిస్తూ వస్తున్నది. ఏపీకి తలకు మించిన భారంగా మారిన అప్పుల వ్యవహారంపై అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతలు అడుగుతోన్న ప్రశ్నలకు కేంద్రం వివరణాత్మక సమాధానాలిస్తున్నది. అప్పులు చేయడంలో ఆంధ్రా అగ్రభాగాన ఉందని ఇదివరకే తేల్చి చెప్పిన కేంద్రం.. తాజాగా అసలు జగన్ సర్కారుకు రుణాలు.. అదీ బడ్జెటేతర అప్పులు ఇస్తున్నది ఎవరో జాబితాను విడుదల చేసింది. వివరాలివి..

పరిమితికి మించి ఏపీ అప్పులు
జగన్ సర్కారు ఎడాపెడా చేస్తోన్న అప్పులకు సంబంధించి ప్రతిపక్ష టీడీపీ, కేంద్రంలో అనధికార మిత్రపక్షంగా ఉన్న బీజేపీలు వరుసగా వైసీపీని ఇరుకునపెట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కమార్.. జగన్ సర్కారు అప్పుల వివరాలివ్వాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను కోరగా, ఆ మేరకు సమాధానాలు వెలువడ్డాయి. రెండు వారాల కిందట, అంటే, జులై 27న ఏపీ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటుకు చెప్పిన సమాధానంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి రు.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని స్పష్టం చేసింది. అంతేకాదు,

2వారాల్లో 2వ సారి వివరణ..
జులై 27న కేంద్ర ఆర్థిక ఆర్థిక శాఖ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో.. 2020-21 ఆర్థిక సంత్సరానికిగాను రు.54,369.18 కోట్లు ఆర్థిక లోటుగా ఆంధ్రా ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టం చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 30,305 కోట్లు, కొవిడ్ కారణంగా మరో రూ. 19,192 కోట్లు అప్పు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్లు కేంద్రం పేర్కొంది. మొత్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి రు. 49,497 కోట్లు అప్పు పొందేందుకు అవకాశం కల్పించినట్లు మంత్రి చౌదరి వివరించారు. కాగా, ఆ సమాధానంతో టీడీపీ ఎంపీ సంతృప్తి చెందలేదో, లేక ఇంకాస్త లోతైన వివరాలిమ్మని అడిగారోగానీ, ఏపీ అప్పులపై రెండు వారాల వ్యవధిలో ఇదే టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర బాబు అడిగిన ప్రశ్నలకు కేంద్రం రెండోసారీ వివరణ ఇచ్చుకుంది. దీంతో..

బడ్జెట్ యేతర అప్పులు రూ.56వేల కోట్లు..
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వివరణతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు మరోసారి తేలిపోయింది. ప్రభుత్వం భారీగా బడ్జెట్‌యేతర అప్పులు చేసినట్లు కేంద్రం ధృవీకరించినట్లయింది. 2019 ఏప్రిల్ 1 నుంచి కార్పొరేషన్‌లు, కంపెనీల పేరుతో రూ. 56,076 కోట్లు అప్పుగా తీసుకుందని కేంద్రం తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్పుల ఊబిలో క్రమక్రమంగా దిగిపోతుందని పార్లమెంట్ సాక్షిగా వెల్లడైనట్లయింది. ఏపీకి సంబంధించిన అప్పలపై ఇటీవల కేంద్రం తీవ్ర వ్యాఖ్యలు చేసిన దరిమిలా టీడీపీ నేత వరుస ప్రశ్నలకు కేంద్రం వివరణాత్మక సమాధానాలు కీలకంగా మారాయి. నిజానికి..

జగన్ సర్కారుకు అప్పులిచ్చింది వీళ్లే..
ఏపీ సర్కారు అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సమాధానాల్లో అప్పులు ఇచ్చింది ఎవరో, ఎంతెంత ఇచ్చారో వివరంగా పేర్కొనడం గమనార్హం. వివిధ బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో ఎక్కువగా ఎస్‌బీఐ నుంచి అత్యధికంగా రూ.15,000 కోట్లకుపైగా తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 9వేల కోట్లకుపైగా రుణం తీసుకుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 7వేల కోట్లు, యూబీఐ నుంచి రూ. 6,800 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 5,700 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 4వేల కోట్లకుపైగా ఏపీ అప్పు తీసుకుందని కేంద్రం పేర్కొంది. జగన్ సర్కారు పరిమితికి మించి అప్పులు చేస్తోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, చివరికి ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి వాటిల్లిందని విమర్శలు వస్తోన్న సమయంలోనే కేంద్రం తాజాగా చేసిన ప్రకటన విపక్షాలకు బలం చేకూర్చినట్టయింది. అయితే,

మోదీపై వైసీపీ ఎదురుదాడి
జగన్ సర్కారు అప్పుల వ్యవహారంపై కేంద్రం వరుసగా ప్రకటనలు చేస్తోన్న దరిమిలా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమైనా తక్కువ తినిందా? ఏకంగా 119 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం అప్పుగా తీసుకోలేదా? అంటూ వైసీపీ సర్కారు ఎదురుదాడి మొదలుపెట్టింది. ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. జగన్ సర్కారును కూలదోయడానికీ బీజేపీ ప్రయత్నిస్తోందన్న మంత్రుల వ్యాఖ్యలు మరింత వేడి రాజేశాయి. ఈ అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏకంగా రాష్ట్రపతికి సంచలన లేఖ రాయగా, ఏపీ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేశారిలా..

జగన్ జైలుకు.. ఏపీలో రాష్ట్రపతి పాలన
ఏపీ అప్పులపై కేంద్రం తాజాగా ఇచ్చిన వివరాలపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి, ఆ పనిని జగన్ సమర్థించుకుంటున్నారని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లేకపోయినా వారి సొంత పేపర్లో గొప్పగా రాసుకుంటున్నారని ఆదినారాయణ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన జగన్.. అక్రమాస్తుల కేసులో త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ అప్పులపై రెబల్ ఎంపీ రఘురామ తాజాగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు రాసిన లేఖలో.. ఆర్టికల్ 356 విధించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ 142శాతం బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసిందని, రాబోయే రోజుల్లో పరిస్థితి భయానకంగా మారుతుందని, ఏపీ చేస్తోన్న అప్పుల్లో 42 శాతం పాత అప్పులపై వడ్డీ చెల్లిచడానికే సరిపోతుందని, జులై రెండో వారం వరకు కూడా ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు చెల్లించలేదని, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేదన్న రఘురామ.. ఏపీలో అత్యవసర పరిస్థితి విధించాలని కోరారు.












Click it and Unblock the Notifications