జగన్ చరిత్ర సృష్టించారు: ఏపీ బడ్జెట్‌పై రోజా ప్రశంసలు, ‘ఆ విషయంలో బాధేసింది’
హైదరాబాద్: దేశంలోనే మహిళా పక్షపాత సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మహిళల కోసం జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టి...47,288 కోట్లు కేటాయించిన సీఎం ఈ దేశంలో జగనన్న ఒక్కరేనని కొనియాడారు.

జగనన్న చేసి చూపించారంటూ రోజా
మహిళా ప్రధాన మంత్రి, మహిళా ముఖ్యమంత్రులెవ్వరూ చేయనిది మహిళల కోసం జగనన్న చేసి చూపించారని రోజా ప్రశంసించారు. ఇంత గొప్ప మహిళా పక్షపాత బడ్జెట్‌ని చంద్రబాబునాయుడు, టీడీపీ బహిష్కరించడం వారి మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనం అన్నారు.14 ఏళ్ళు సీఎం గా చేసిన చంద్రబాబు ఏనాడైనా జెండర్ బడ్జెట్ కానీ, మహిళల కోసం జగనన్న అమలు చేస్తున్న పథకాలు కానీ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు.

జగన్ చరిత్ర సృష్టించారన్న..
తొలిసారి జెండర్ బడ్జెట్ తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన సీఎం జగన్‌కు మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఎమ్మెల్యే రోజా. ఆరోగ్య సమస్యల వల్ల తాను అసెంబ్లీకి హాజరుకాకపోవడం బాధగా ఉందని అన్నారు. రాష్ట్రాన్ని మరో 30 ఏళ్లు పాలించే టార్చ్ బేరర్ సీఎం జగన్ అని అన్నారు.

ఏపీ బడ్జెట్‌లో మహిళలకు పెద్దపీట.. అత్యధిక కేటాయింపులు
కాగా, ఏపీ బడ్జెట్‌లో మహిళలకు పెద్దపీట వేస్తూ రూ. 47,288 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్ ఆసరా పథకం ద్వారా 2019, ఏప్రిల్ 11 నాటికి ఉన్న 27,168 కోట్ల రూపాయల బ్యాంకు బకాయిల్లో.. మొదటి విడతగా 2020 సెప్టెంబర్ 11న 6,337 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రెండవ విడతలో భాగంగా 2021-22 ఏడాదికి గాను మరో 6,337 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ, వైఎస్‌ఆర్ చేయూత కేటాయింపులు ఇలా
ఏపీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24 వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా 2019-20 సంవత్సారానికి చెందిన రుణాలపై వడ్డీకి సంబంధించి 1400 కోట్ల రూపాయలను బదిలీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ 2021లో ఈ పథకానికి 1,112 కోట్ల రూపాయలు విడుదల చేయగా.. 2021-22కు గాను మరో 1,112 కోట్ల రూపాయలను కేటాయించింది.
మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం 2020 ఆగస్టు 12న వైఎస్‌ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 45-60 ఏళ్ల లోపు షెడ్యూల్డ్ కులాల, తెగల, వెనకబడిన తరగతుల, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 23 లక్షల 76 వేల మహిళా లబ్దిదారులకు 4,455 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రెండో విడతలో భాగంగా 2021-22కు గాను మరో 4,455 కోట్లు కేటాయించింది.












Click it and Unblock the Notifications