ఏపీ బడ్జెట్‌పై అంచనాలు ఇవీ: తొలిసారి రికార్డు స్థాయిలో..
Chandrababu: ఏపీ వార్షిక బడ్జెట్.. ఇంకాస్సేపట్లో సభ ముందుకు రాబోతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరంచుకుంది. గత ఏడాది నవంబర్‌లో నాలుగు నెలల కాలానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.
ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025- 26కు సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. సభ ముందుకు తీసుకొస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో కొల్లు రవీంద్ర ఆర్థిక బడ్జెట్‌ను, నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమౌతుంది. ఇందులో బడ్జెట్ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ఈ సారి 3.18 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందనే అంచనా ఉన్నాయి.
ఈ కేటాయింపుల్లో ప్రాథమిక విద్య, వ్యవసాయం, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం సహా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు- ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. సంక్షేమ పథకాలను కొనసాగించడం, సూపర్ సిక్స్‌లోని మిగిలిన వాటికి కూడా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గత ఏడాది 2,94,427 కోట్ల రూపాయలకు బడ్జెట్‌ను ప్రతిపాదించగా, ద్రవ్య వినిమయ బిల్లులో ఆ మొత్తాన్ని 3,04,020 కోట్లకు సవరించినట్లు సమాచారం. తొలిసారిగా రికార్డుస్థాయిలో 3 లక్షల కోట్ల రూపాయల మార్కును బడ్జెట్ దాటినట్లవుతుంది. గత బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయానికి 2.36 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. ఈ సారి 2.45 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు.












Click it and Unblock the Notifications