ఏపీ కేబినెట్ భేటీ: ఉద్యోగుల బకాయిలు, స్థానిక ఎన్నికల పై కీలక నిర్ణయాలు..!!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ పెండింగ్ అంశాల పరిష్కారం పైన ఫోకస్ చేస్తోంది. ఉద్యోగుల నుంచి పీఆర్సీ.. బకాయిల పైన నిర్ణయం దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో నిర్మాణాల పైన సమీక్ష తో పాటుగా కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. లోకల్ బాడీ ఎన్నికల వేళ మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఏపీ కేబినెట్ కీలక భేటీ నేడు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాధాన్యత కలిగిన అంశాలను చర్చించనున్నారు. ఉద్యోగుల నుంచి పెండింగ్ బకాయిలు.. పీఆర్సీ పైన నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. పెండింగ్ డీఏల్లో కొంత మేర విడుదల దిశగా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చల దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పీఆర్సీ పైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అదే విధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ పైనా చర్చించి.. ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. బీసీ రిజర్వేషన్లు, సర్ ప్రక్రియ వేళ ఎన్నికల నిర్వహణ పైన కోర్టులో కేసులు నమోదు అయ్యాయి. దీంతో.. న్యాయ నిపుణుల సలహాలు.. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయాల పైన చర్చించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

కీలక అంశాలపై చర్చ.. నిర్ణయాలు
అదే విధంగా అమరావతిలో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్‌కు 596 కోట్ల రూపాయలు కేటాయించడం, రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులకు రూ.533 కోట్లు, రైతుల ప్లాట్లలో బీటీరోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలను మంత్రి వర్గం ఆమోదించనుంది. మంగళగిరి-తాడేపల్లికి అమరావతి నుంచి తాగునీరు, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్‌కు భూసమీకరణపై చర్చ జరగనుంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపైనా నిర్ణయం తీసుకోనున్నారు. అధికారిక ఎజెండా పూర్తయిన అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల పైనా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రభావం.. చర్యలతో పాటుగా పెరుగుతున్న నిత్యావసర ధరల నియంత్రణ పైనా మంత్రివర్గ భేటీలో చర్చించి.. కార్యాచరణ ఖరారు చేయనున్నారు.













Click it and Unblock the Notifications