ఏపీ సచివాలయాల్లో భారీ మార్పులు-కేబినెట్ ఆమోద ముద్ర..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల వల్ల అనుకున్న స్ధాయిలో ప్రభావం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంలో చెప్పినట్లుగానే గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు అందులో పనిచేసే ఉద్యోగులను కూడా పలు కేటగిరీలుగా విభజించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలో దీన్ని రాష్ట్ర, జిల్లా స్దాయి కమిటీల ద్వారా అమల్లోకి తెస్తారు.
గతంలో అనాలోచితంగా ఏర్పాటు చేసిన సచివాలయాలు ప్రభావవంతంగా పనిచేయడం లేదనే ఆలోచన ఉన్నందున వాటిని మూడు కేటగిరీలుగా విభజించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పార్దసారధి తెలిపారు. జనాభా ఆధారంగా సచివాలయాల్ని విభజిస్తారు. ప్రస్తుతం ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల వ్యవస్థ అలాగే కొనసాగుతుంది. అయితే జనాభా ఆధారంగా వాటి విభజన, ఉద్యోగుల కేటాయింపు ఉంటుంది.

3500 కంటే ఎక్కువ జనాభా ఉంటే 8 మంది సిబ్బందితో ఓ కేటగిరీ సచివాలయంగా ఏర్పాటు చేస్తారు. 2500-3500 జనాభా ఉంటే ఏడుగురు సిబ్బందితో మరో కేటగిరీ సచివాలయంగా ఏర్పాటు చేస్తారు. 2500 కంటే జనాభా తక్కువగా ఉంటే ఆరుగురు సిబ్బందితో మరో కేటగిరీ సచివాలయం ఏర్పాటవుతుంది. అందులో పనిచేసే ఉద్యోగుల్ని సైతం మూడు వర్గాలుగా విభజిస్తారు.
టెక్నికల్, మల్టీపర్పస్, యాస్పిరేషనల్ సెక్రటరీలుగా వీరిని విభజించాలని నిర్ణయించారు.
అలాగే సచివాలయాల హేతుబద్ధీకరణను పర్యవేక్షించేందుకు రాష్ట్రస్దాయి, జిల్లా స్థాయి కమిటీలను నియమించబోతున్నారు. రాష్ట్ర స్దాయి కమిటీలో రెవెన్యూ మంత్రి ఛైర్మన్ గా, మున్సిపల్, హౌసింగ్ మంత్రులు, ఉన్నతాధికారులు ఉంటారు. జిల్లా కమిటీలో ఇన్ ఛార్జ్ మంత్రి ఛైర్మన్ గా, కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర అధికారులతో ఏర్పాటు చేస్తారు.












Click it and Unblock the Notifications