AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ-ఇసుక, తల్లికివందనం మార్గదర్శకాలు-అసెంబ్లీపై చర్చ..!
ఏపీలో ఇవాళ సమావేశమైన కూటమి కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండో అసెంబ్లీ భేటీ కావడంతో ఇందులో పలు సంక్షేమ పథకాలతో పాటు బడ్జెట్, ఇతర అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి.
దీనిపై చర్చించి ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలు, గత వైసీపీ సర్కార్ అవినీతి, శ్వేతపత్రాల విడుదల వంటి అంశాలపైనా మంత్రులు చర్చిస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కారణంగా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సాధ్యం కాలేదు. దీంతో ఓటాన్ బడ్జెట్ మాత్రమే ఆమోదించారు. ఇప్పుడు మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు వెళ్లాలా లేక పూర్తి స్దాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా అన్న దానిపై కేబినెట్ చర్చిస్తోంది. బడ్జెట్ అంచనాల సేకరణకు సమయం తక్కువగా ఉండటం, గతంలో ఆమోదించిన ఓటాన్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తున్న రెండు కీలక పథకాలు ఉచిత ఇసుక, తల్లికి వందనం విషయంలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పి అమ్ముకుంటున్నారంటూ వైసీపీ విమర్శలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇసుక పాలసీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే తల్లికి వందనం విషయంలోనూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ముగ్గురు పిల్లల ప్రస్తావన లేకపోవడంపై విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. దీంతో తల్లికి వందనం మార్గదర్శకాల్లో ఈ మేరకు మార్పులు చేయనున్నారు. అలాగే త్వరలో మద్యం పాలసీ విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications