బాబు ఉద్వేగ ప్రసంగం: కెసిఆర్‌తో కలిసి వెళ్తా, తలూపిన తెలంగాణ సిఎం, మోడీ చప్పట్లు
అమరావతి: రాజధాని అమరావతి శంకుస్థాపన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామన్నారు. దేశానికి విజయదశమి ఒక పండుగ అయితే ఏపీ ప్రజలకు రెండు పండుగలు వచ్చాయన్నారు. పార్లమెంటు నుంచి మట్టి, యమునా నది నుంచి మట్టి, నీరు తెచ్చిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు కేంద్రం ఏపీకి సాయం చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల్లా ఆదాయం వచ్చే రాజధానులు తమ రాష్ట్రానికి లేదని కేంద్రం ఇందుకు సహకరించాలని కోరారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం అన్నారు. అన్ని గ్రామాల నుంచి కులమతాలకు అతీతంగా మన నీరు మన మట్టి కార్యక్రమం నిర్వహించారన్నారు. దేశంలో మహానుభావుల గ్రామాల నుంచి మట్టి తెచ్చామన్నారు.

అమరావతి చరిత్రను ప్రధాని మోడీకి వివరించారు. మోడీ సహకారంతో ప్రపంచంలో ఉత్తమ రాజధాని నిర్మిస్తామన్న నమ్మకం ఉందన్నారు. సింగపూర్ ప్రభుత్వం అడిగిన వెంటనే స్పందించి మూడు మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేసి ఇచ్చిందన్నారు.
జపాన్ ప్రభుత్వం కూడా సహకరించేందుకు ముందుకు వచ్చిందన్నారు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రపంచలోని అత్యుత్తమ సంస్థలకు ఆహ్వానం పలికామన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి కేంద్రంగా మారనుందన్నారు.
కెసిఆర్, నేను కలిసి పని చేయాలని...
విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేయాలని.. తాను, తెలంగాణ సీఎం కెసిఆర్ భావిస్తున్నామన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు. దీనికి కెసిఆర్ సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఆహ్వానించగానే అమరావతికి వచ్చినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజులాగానే భవిష్యత్తులో కూడా కేసీఆర్ కలసికట్టుగా ఉండాలని అభిలషించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకుసాగుదామన్నారు. ఈ సందర్భంగా.. సరే అన్నట్టు కేసీఆర్ తల ఊపారు.
చంద్రబాబు ఉద్వేగ ప్రసంగం
చంద్రబాబు ప్రసంగించిన సమయంలో ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. కొన్ని రాజకీయ పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వెనుకడుగు వేయని రైతులు తమపై నమ్మకముంచి భూములను అప్పగించారని ఆయన పేర్కొన్నారు. రైతులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా రాజధానిని నిర్మించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
కాగా, చంద్రబాబు ప్రసంగానికి ప్రధాని మోడీ చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ అమరావతి గొప్పదనాన్ని వివరించారు. దేశంలోని వివిధ పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని, పుణ్య నదుల నీటిని అమరావతి వ్యాప్తంగా తానే స్వయంగా చల్లానన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రధానిని ప్రస్తావిస్తూ... అమరావతిని తప్పనిసరిగా విజయంతం చేస్తామన్నారు. దీంతో, ప్రధాని మోడీ చప్పట్లు కొట్టారు. అమరావతికి ఉన్న సౌలభ్యాలు, తాము చేపడుతున్న చర్యలను చంద్రబాబు చెప్పినప్పుడు కూడా మోడీ చప్పట్లు కొట్టారు.












Click it and Unblock the Notifications