డీలిమిటేషన్ బిల్లు వేళ కేంద్రానికి ఝలక్..! టీఎంసీ రెబెల్స్ యూటర్న్..!
గత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు-మహిళా బిల్లు (Delimitation bill) కలిపి నెగ్గించుకునేందుకు ప్రయత్నించిన కేంద్రానికి (Centre) విపక్షాలు షాకిచ్చాయి. పార్లమెంట్ లో 2/3 వంతు మెజార్టీ లేకపోయినా ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టిన కేంద్రానికి భంగపాటు తప్పలేదు. దీంతో ఈ మద్యకాలంలో టీఎంసీ, ఆప్, శివసేన పార్టీల్ని చీల్చి ఎంపీల్ని తమవైపు తిప్పుకుని ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్న కేంద్రానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. అదే టీఎంసీ రెబెల్ ఎంపీల యూటర్న్.
గత పార్లమెంట్ సమావేశాల తర్వాత జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన టీఎంసీకి (TMC) ఏకంగా 20 మందికి పైగా ఎంపీలు గుడ్ బై చెప్పేసి వేరు కుంపటి పెట్టుకుందామని భావించారు. అలా కుదరకపోవడంతో త్రిపురకు చెందిన ఎన్సీపీఐలో వీరు విలీనం అయ్యారు. ఈ ఎన్సీపీఐ కేంద్రానికి పార్లమెంట్ లో ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లుపై మద్దతివ్వాలనేది అసలు ప్లాన్. అయితే ఇందులో ముగ్గురు ముస్లిం ఎంపీలు బీజేపీకి ఎన్సీపీఐ దగ్గర కావడంపై గుర్రుగా ఉన్నారు. వీరు తిరిగి టీఎంసీ గూటికి చేరుకునేందుకు సిద్దమవుతున్నారు.

బీజేపీతో ఎన్సీపీఐకి ఉన్న సన్నిహిత సంబంధాలపై అసంతృప్తితో ఉన్న తృణమూల్ రెబెల్స్, ఎన్‌సీపీఐ ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహమాన్, యూసుఫ్ పఠాన్... ఎన్డీయే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అధికార పార్టీకి దగ్గరగా ఉండటం వల్ల తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్ సీఎం సువేందు అధికారిని కలిసి.. ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా ముర్షిదాబాద్ లో ప్రజలు వేధింపులకు గురయ్యారని ఆరోపించారు. అనంతరం మాట్లాడుతూ.. తాము బీజేపీతో కలిసి వెళ్లబోమని, ఎన్డీయేలో భాగం కాబోమని ఇప్పటికే స్పష్టం చేశామని తాహెర్ ఖాన్ తెలిపారు. ముస్లింలలో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. దీంతో వీరు డీలిమిటేషన్ వేళ బీజేపీకి అండగా నిలబడటం అనుమానంగానే ఉంది.




Click it and Unblock the Notifications