వేదికపై కెసిఆర్-బాబు సంతోషంగా ఉంది, మోడీ ఏం చేస్తారో అర్థమౌతోంది: వెంకయ్య
అమరావతి: రాజధాని అమరావతి శంకుస్థాపన అనంతరం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు.
రాజధాని వేదికగా ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక పైకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ప్రధాని మోడీ కూడా రాజధాని కోసం పుట్టమన్ను తెచ్చారని, దీంతో, అమరావతికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమౌతోందన్నారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు. చరిత్రలో రాజధాని అజరామంగా నిలుస్తుందన్నారు. నేను సైతం అమరావతికి... అంటూ ప్రధాని మోడీ పార్లమెంటు నుంచి మట్టి, యమున నుంచి నీటిని తీసుకురావడం అమరావతి భవిష్యత్తు గురించి చెప్పకనే చెబుతోందన్నారు.

ప్రధాని మోడీ చెప్పిన మాటతో అమరావతికి ఆయన ఏం చేయబోతున్నారు? అనే విషయం అర్థమవుతోందన్నారు. అమరావతి ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతుందన్నారు. కెసిఆర్, చంద్రబాబు.. ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును సూచిస్తోందన్నారు.
ఇద్దరూ ముఖ్యమంత్రులు ఇదే విధంగా సహాయ, సహకారాలతో ముందుకు వెళ్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో దూసుకుపోవడం ఖాయమన్నారు. ప్రధాని మోడీ పరిపాలనలో భారత దేశం ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకుంటోందన్నారు.


Click it and Unblock the Notifications