అమరావతి రాజధానిపై తేల్చేసిన కేంద్రం - పార్లమెంట్ సాక్షిగా..!!
ఏపీ రాజధాని వ్యవహారంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.రాజధాని అంశం పైన స్పష్టత ఇచ్చింది.
ఏపీ రాజధాని వ్యవహారంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అమరావతి రాజధానిగా ఎలా ఏర్పడిందనేది వివరించింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వ ఆలోచనను ప్రస్తావించింది. మూడు రాజధాను అంశాన్ని అందులో వివరించింది. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందని గుర్తు చేసింది. అదే సమయంలో ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని కేంద్రం పేర్కొంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధానిగా ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసిది. పార్లమెంట్ లో ఎంపీ సాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం 5,6 సెక్షన్ల ప్రకారం రాజధాని ఏర్పాటుకు సంబంధించిన అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కేంద్రం నాడు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేసింది.
ఆ కమిటీ ఇచ్చిన సూచనలు.. సలహాలను కేంద్రం నాటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందని వివరించింది. ఆ తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా ఎంపిక చేస్తూ నోటీఫికేషన్ జారీ చేసిందని కేంద్ర మంత్రి తన సమాధానం లో వివరించారు. ఆ తరువాత ఏపీ సీఆర్డీఏ ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గురించి హోం శాఖ గతంలో పార్లమెంట్ కు నివేదించిందని పేర్కొన్నారు.

మూడు రాజధానుల బిల్లు తెచ్చిన ప్రభుత్వం
2020 లో ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తూ..మూడు రాజధానుల ప్రతిపాదనను బిల్లు రూపంలో తీసుకొచ్చిందని తన సమాధానంలో ప్రస్తావించారు.సీఆర్డీఏ చట్టానికి కొనసాగింపుగా మరో బిల్లు తీసుకొచ్చినట్లుగా వివరించారు. అయితే, విజయ సాయిరెడ్డి తన ప్రశ్నలో రాజధానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా అంటూ ప్రశ్నించారు.
దీనికి ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని..ఇంతకు మించి దీని పైన చెప్పటానికి ఏమీ లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. కోర్టులో ఉన్న ఈ అంశం పైన మాట్లాడటం సబ్ జ్యూడిస్ అవుతుందని పేర్కొంది. దీని ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చే మార్గదర్శకాలే ఏపీ రాజధాని విషయంలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, మూడు రాజధానులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్రం చెబుతోంది.

విశాఖ నుంచి పాలన ఉండేనా..
ఈ నెల 23న సుప్రీంకోర్టులో విచారణ..తరువాత తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పాలన చేసే వెసులుబాటు ఉండటంతో..విశాఖ నుంచి పాలన చేసే విధంగా ముఖ్యమంత్రి అలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఢిల్లీ వేదికగా పెట్టుబడుల సన్నాహక సదస్సులో సీఎం జగన్ తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని..ఏపీకి విశాఖే రాజధాని అని చెప్పుకొచ్చారు. సీఎం తన క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటుకు అభ్యంతరం లేదు. సచివాలయం తరలింపు పైన మాత్రం కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో.. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications