2024 వరకు హైదరాబాదే రాజధాని - అసెంబ్లీ చట్టాలు చేయద్దంటే ఎలా : బొత్సా సంచలనం..!!
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ మంత్రి బొత్సా సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి పైన హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత ప్రభుత్వం ఏం చేయబోతుందనే ఉత్కంఠ మొదలైంది. మూడు రాజధానుల బిల్లును మరోసారి తీసుకొస్తారని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరిగినా.. కోర్టు తీర్పుతో దాని మీద నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అదే సమయంలో హైకోర్టు తీర్పులో భాగంగా రాజధాని మార్పు అధికారం అసెంబ్లీకి లేదనే విధంగా చేసిన వ్యాఖ్యల పైన అసెంబ్లీలో చర్చ జరగాలని సీనియర్ నేత ధర్మాన సీఎంకు లేఖ రాసారు.

ప్రభుత్వం వ్యూహం మార్చిందా..
న్యాయ - శాసన వ్యవస్థల అధికారాల పైన చర్చ చేయాల్సిన అవసరం ఉందని ఆయన రాసిన లేఖతో ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఆ అంశం పైన చర్చ చేపడుతుందా లేదా అనే ఆసక్తి కూడా కనిపిస్తోంది. ఇదే సమయంలో మంత్రి బొత్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తన స్వార్దం కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటారని వ్యాఖ్యానించారు. శాసనసభను చట్టం చేయద్దంటే ఎలా..సభ ఉన్నదే చట్టం చేయటం కోసమని చెప్పుకొచ్చారు. ఏ వ్యవస్థ అయినా చట్టానికి లోబడే పని చేయాల్సిన అసవరం ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో శివరామక్రిష్ణ కమిటీ వేసి రాజధాని అంశాన్ని తేల్చాలని నిర్ణయించారని గుర్తు చేసారు.

ఉమ్మడి రాజధాని ప్రస్తావన
అయితే, చంద్రబాబు ప్రభుత్వం నాడు నారాయణ కమిటీ వేసి రాజధాని నిర్ణయించిందని బొత్సా చెప్పుకొచ్చారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న ఏ నిర్ణయం..ప్రకటన పార్లమెంట్ కు పంపలేదని వివరించారు. విభజన చట్టం ప్రకారం 2024 దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. దీంతో..హైదరాబాద్ రాజధాని అని కీలక వ్యాఖ్య చేసారు. దీనికి కొనసాగింపుగా అమరావతిని తమ వరకు శాసన రాజధానిగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని..ఆ తరువాత మార్చుకుంటారని చెప్పారు. గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు చేసిన ప్రవర్తనను ఆయన ఖండించారు.
Recommended Video

బొత్సా వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలు
ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజన చేస్తోందని బొత్సా వివరించారు. అయితే, మూడు రాజధానులు - అమరావతి- సీఆర్డీఏ అంశం పైన హైకోర్టు తీర్పు రావటంతో.. ప్రభుత్వం దీని పైన సుప్రీంకోర్టు అప్పీల్ కు వెళ్లే విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ సమావేశాల సమయంలో రాజధానుల వ్యవహారం పైన క్లారిటీ ఇస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఇప్పుడు మంత్రి బొత్సా మరోసారి ఉమ్మడి రాజధాని.. 2024 వరకూ హైదరాబాద్ రాజధానిగా ఉంటుందంటూ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఇప్పుడు మరింత ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications