అక్కడే: ఎపి రాజధానిపై చంద్రబాబు ఆలోచన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడనే విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ స్పష్టమైన ఆలోచనకు వచ్చినట్లే కనిపిస్తున్నారు. విజయవాడ, గుంటూరు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలనే తన ఆలోచనను ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో బయటపెట్టారు. ఆ ప్రాంతంలోనైతేనే హైదరాబాద్ అంతటి నగరాన్ని నిర్మించగలమని ఆయన అన్నారు.
రాజధాని ఏర్పాటుకు అక్కడి ప్రజలు, రైతులు సహకరించాల్సి ఉంటుందని, వారు సహకరించకపోతే మరో ప్రాంతం చూస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్ వంటి నగరం నిర్మించాలంటే ఐదేళ్లు పడుతుందో, పదేళ్లు పడుతుందో, ఎన్నేళ్లు పడుతుందో చెప్పాలేమని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేయడం ద్వారా ఆ జిల్లా ప్రజలను సంతృప్తి పరిచే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్ అక్కడి నుంచి వస్తోంది.
పునాదుల నుంచి మొదలుపెట్టే రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు మరోసారి విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ సహా పలు పథకాల అమలుకు నిధుల సమీకరణపై అధికార యంత్రాంగంతో నిరంతరం సమాలోచనలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను త్వరలోనే వెల్లడిస్తానని, రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి తగిన నిధులు రాబట్టేందకు ప్రయత్నిస్తానని పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications