ఎపి రాజధాని తరలింపునకు ముహూర్తం రెడీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారైంది. తాత్కాలికంగా రాజధానిని విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని ప్రధానమైన కమిషనరేట్లను జూన్ 7వ తేదీకల్లా నవ్యాంధ్ర రాజధానికి తాత్కాలికంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాంటూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన స్థల సేకరణ జరిగిందని, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. తాత్కాలిక రాజధానికి సంబంధించి డ్రైనేజీ, తాగునీటి వసతి, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు.
ఈ ఏడాది జూన్‌నాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ పూర్తవుతుందని చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సింగపూర్ ప్రభుత్వం సహకరిస్తోందని, మన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగానే సామాజిక, ఆర్థిక రాజధాని ఏర్పాటవుతుందని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం మూడు రకాల డిజైన్లు రూపొందిస్తోందని, వీటిని వెబ్‌సైట్లో ఉంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని వెల్లడించారు.

ఇప్పటి వరకు రాజధాని భూ సమీకరణకు 14,016 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారన్నారు. ఈనెల 15వ తేదీనాటికి రాజధానికి కావాల్సిన 30 వేల ఎకరాల భూ సమీకరణ పూర్తవుతుందన్నారు. ఐదారు గ్రామాల్లో 90 శాతం భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చారన్నారు. మూడు శాతం మందికి చెందిన భూమి వివాదంలో ఉందని, దాంతో, కొంత అలస్యం అవుతోందని, అయినా, వివాదంలో ఉన్న వారందరూ అంగీకార పత్రాలు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు సింగిల్ టైం సెటిల్‌మెంట్ కింద లక్షన్నర రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించామని, ఇప్పటి వరకు 7424 మంది రైతులకు రుణమాఫీ పూర్తయిందని తెలిపారు.
గ్రామ కంఠాల్లో మినహా రాజధాని పరిధిలో ప్రైవేట్ కట్టడాలను అనుమతించడం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పొలాల్లో ఎక్కడైనా ఇళ్లు నిర్మించి ఉంటే వాటికి బదులుగా వేరే ప్రదేశంలో అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ను నిర్మించి ఇస్తామన్నారు. కొన్నిచోట్ల పొలాల్లో ఉన్న సమాధుల గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధాని పరిధిలోని బోరుపాలెం, ప్రకాశం బ్యారేజ్, వై జంక్షన్ (ఆటోనగర్), నీరుకొండ తదితర ప్రాంతాల్లో అక్రమంగా వేసిన లే అవుట్లను తొలగించామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో అసైన్డ్ భూమితోపాటు ఇరిగేషన్ శాఖకు చెందిన 23 భవనాలు, మూడు షెడ్ల నిర్మాణాలు ఉన్నాయని, వీటికి సంబంధించి సమాచారం తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications