టీడీపీ ఆర్థిక మూలాలపై గురిపెట్టిన ముఖ్యమంత్రి జగన్?
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కొన్ని నెలలుగా జరుగుతోంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కూడా ఆ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతోపాటు జనసేనాని కూడా ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. చంద్రబాబునాయుడు ఇప్పటికే జిల్లాల పర్యటనలు చేస్తుండగా, విజయదశమి నుంచి పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

రోజురోజుకు బలపడుతున్న టీడీపీ?
ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలపడుతోందని తేలుతుండటంతో ఆ పార్టీపై పైచేయి సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఏ పార్టీకైనా, నాయకుడికైనా ఆర్థిక మూలాలు ముఖ్యం. ఆ మూలాలను దెబ్బకొడితే సగం విజయం సాధించినట్లేనని అధికార పార్టీ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఆర్థికంగా దన్నుగా నిలబడినవారెవరా అని ప్రభుత్వం దృష్టిసారించినట్లు సమాచారం.

ఎవరెవరు ఏ వ్యాపారాలు చేస్తున్నారు?
టీడీపీ నేతలంతా భారీ వ్యాపారాలను నిర్వహించేవారు కావడంతోపాటు పరోక్షంగా కూడా మరికొందరు పారిశ్రామికవేత్తలు మద్దతు ఇస్తున్నట్లు గుర్తించారు. ఎవరెవరె ఏ వ్యాపారాలు చేస్తున్నారు? వారి ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? తదితర విషయాలన్నీ సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది నాయకులను నయానో భయానో తమ పార్టీలోకి చేర్పించుకున్నారు. కొంతమంది మాత్రం పట్టుదలగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. వీరిని ఆర్థికంగా దిగ్బంధనం చేస్తే ఎన్నికల్లో విజయం సులువవుతుందనేది వైసీపీ భావనగా ఉంది. అందుకు మద్దతుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం తీసుకుంటోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

గంటా, యరపతినేని తదితరులు?
జేడీ ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన ఈడీ దాడి పాత కేసులోదే అని చెబుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలను బీజేపీ పెద్దలు లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీద మస్తాన్‌రావు, శిద్ధా రాఘవరావు, కరణం బలరాం, వల్లభనేని వంశీ లాంటివారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మురళీమోహన్, నారాయణ లాంటివారు టీడీపీతో సంబంధం లేకుండా తమ వ్యాపారాలు తాము చూసుకుంటున్నారు. తాజాగా గంటా శ్రీనివాసరావు, నారాయణ, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తదితరుల పేర్లు వినపడుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు కూడా మురళీమోహన్, నారాయణ, పోతుల రామారావు తదితరుల నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. దాంతో టీడీపీ ఆర్థిక దిగ్బంధనంలో కూరుకుపోయింది. మరోసారి ఇదే తరహా వ్యూహాన్ని అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అమలు చేయబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications