సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. వారికి రూ.5 లక్షలు
ఏపీ, తెలంగా?. రెండు తెలుగు రాష్ట్రాల్లోను వానలు జోరెత్తుతున్నాయి. విజయవాడలో గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. గుంటూరు నుంచి విజయవాడ మధ్యలో ఉన్న కాజా టోల్ ప్లాజా వద్ద నీరు నిలిచిపోవడంతో ప్రజలెవరూ బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మరో రెండురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండమే ఈ వర్షాలకు కారణం.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీచేస్తున్నారు. ప్రజలకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక్కో జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున, తక్కువ తీవ్రత ఉంటే ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున అత్యవసర సాయాన్ని విడుదల చేశారు. జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలంటూ చంద్రబాబు ఆదేశించారు.

ప్రయివేటు విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలు అనుసరించాలి
భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించి మంగళవారం కూడా సెలవు విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ప్రయివేటు విద్యాసంస్థలు సెలవులివ్వడంలేదని వార్తలు వస్తుండటంతో కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు. ఫలక్ నుమా, గోల్కొండ, సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్ సిటీ, శాతవాహన, విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్, శబరి, దేవనగరి, కరీంనగర్-తిరుపతి సూపర్ ఫాస్ట్.. తదితర రైళ్లను రద్దు చేశారు. మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య కట్ట తెగడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications