అమరావతి అసైన్డ్ దర్యాప్తు కొలిక్కి-త్వరలో నివేదిక-జగన్, చంద్రబాబు ఇద్దరికీ కీలకమే !
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో అసైన్డ్ భూములు అక్రమంగా చేతులు మారాయంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కొలిక్కి వచ్చింది. కొన్ని నెలలుగా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ.. ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇవ్వబోతోంది. అయితే ఇందులో ఏముందనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది.

అమరావతి అసైన్డ్ భూముల వివాదం
అమరావతిలో గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్ని టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని రాక సందర్భంగా అక్రమంగా లాక్కున్నారనే ఆరోపణల్ని వైసీపీ ఎప్పటినుంచో చేస్తోంది. దీనిపై అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశాలు ఇచ్చింది. మంత్రివర్గ ఉపసంఘంతో పాటు పలు దర్యాప్తులు జరిపినా ఇందులో ఏమీ తేలలేదు. దీంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగింది. మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ పాత్రపై కేసులు నమోదు చేసింది. అసలు అమరావతి అసైన్డ్ భూములు ఎలా చేతులు మారాయన్న దానిపై దర్యాప్తు జరుపుతోంది.

సీఐడీ విచారణ కొలిక్కి
అమరావతి అసైన్డ్ భూములు రాజధాని రాక సందర్భంగా చేతులు మారాయన్న ఆరోపణలపై ఆర్కే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ.. విచారణ సమగ్రంగా విచారణ జరిపింది. అదే సమయంలో ప్రభుత్వం కూడా వివాదాస్పద భూములకు ఏటా ఇచ్చే కౌలు కూడా నిలిపేసింది. దీంతో ఈ వ్యవహారం రాజధానిలో తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తంగా 3129 మంది రైతులు రాజధాని కోసం ఇచ్చిన 2689 ఎకరాలకు సంబంధించి తలెత్తిన వివాదంపై సీఐడీ దర్యాప్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అక్రమాలు జరిగాయా లేదా అన్న దానిపై సీఐడీ దర్యాప్తు కొలిక్కి రావడంతో త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది.

మరో ఇన్ సైడర్ కానుందా ?
అమరావతి అసైన్డ్ భూములు భారీగా చేతులు మారాయంటూ ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన సీఐడీ దర్యాప్తు పూర్తి చేసింది. అయితే సీఐడీ దర్యాప్తులోనూ ఇందులో పెద్దగా వ్యత్యాసం కనిపించలేదని తెలుస్తోంది. దీంతో గతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వైసీపీ చేసిన ఆరోపణలపై జరిపిన దర్యాప్తుల తరహాలోనే ఇది కూడా తేలిపోతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే జరిగితే చంద్రబాబు, నారాయణ సహా పలువురు రాజకీయ నేతల పాత్రను నిరూపించడంలో సీఐడీ ఏం చేయబోతోందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇందులో విఫలమైతే మాత్రం ఇది కూడా మరో ఇన్ సైడర్ ట్రేడింగ్ లాగే తేలిపోవడం ఖాయం.

జగన్, చంద్రబాబుకు కీలకం ?
అమరావతి రాజధానిలో భూముల కుంభకోణం జరిగిందంటూ వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది. వీటిపై సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ను హైకోర్టు, సుప్రీంకోర్టు తోసిపుచ్చాయి. ఆ తర్వాత అసైన్డ్ భూములు చేతులు మారాయంటూ చంద్రబాబు, నారాయణను ఈ కేసుల్లో పెట్టారు. అయితే ఇప్పుడు సీఐడీ దర్యాప్తులో అసైన్డ్ అక్రమాలు తేలకపోతే మాత్రం అమరావతిలో చంద్రబాబుకు క్లీన్ చిట్ లభించడం ఖాయం. అలా కాకుండా జగన్ సర్కార్ ఈ అక్రమాల్లో చంద్రబాబు పాత్రను నిరూపించగలిగితే మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ వ్యవహారం అమరావతిలో పలు లెక్కల్ని మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications