మార్గదర్శి కేసులో రామోజీరావు, కోడలు శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు..
అమరావతి : ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వీటిపై దర్యాప్తు జరుపుతున్న ఏపీ సీఐడీ ఇప్పటికే పలువురు సంస్ధ బ్రాంచ్ ల మేనేజర్లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపింది. ఇదే క్రమంలో తాజాగా సంస్ధ ఎండీ శైలజతో పాటు రామోజీ గ్రూప్ ఛైర్మన్ గా ఉన్నరామోజీరావుకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మార్గదర్శి అక్రమాల కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నించేందుకు వీలుగా రామోజీరావుతో పాటు శైలజ కూడా అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం సీఐడీ అధికారులు నాలుగు తేదీల్ని వీరిద్దరికీ సూచించారు. మార్చి 29, 31, ఏప్రిల్ 3, ఏప్రిల్ 6 ఈ నాలుగు తేదీల్లో ఒకరోజు విచారణకు అందుబాటులో ఉండాలని వీరిద్దరికీ జారీ చేసిన వేర్వేరు నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. విచారణ కోసం ఇల్లు లేదా ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని వీరిద్దరిని కోరారు.

మార్గదర్శి అక్రమాల కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ1గా ఉండగా.. ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ ఏ2గా ఉన్నారు. దీంతో వీరిద్దరిని విచారించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. సమాజంలో వీరికున్న పరువు, ప్రతిష్టల్ని దృష్టిలో ఉంచుకుని ఇతర నిందితుల తరహాలో సీఐడీ కార్యాలయంలో కాకుండా వారి ఇల్లు, లేదా ఆఫీసుల్లోనే వీరిని విచారించేందుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది.
మరోవైపు ఏపీలో మార్గదర్శి సంస్ధ ఆఫీసులపై తీవ్ర చర్యలు తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఉన్న మార్గదర్శి సంస్ధ ప్రధాన కార్యాలయంతో పాటు ఏపీలోని ఇతర బ్రాంచ్ ఆఫీసులపైనా, అందులో పనిచేసే సంస్ధలపైనా తీవ్ర చర్యలు తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు నిందితుల్ని ప్రశ్నించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications