టీడీపీకి ఏపీ సీఐడీ నోటీసులు- ఆ రూ.27 కోట్ల వివరాలు కోరుతూ...
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు సహా పలువురు నిందితుల్ని అరెస్టు చేసిన సీఐడీ.. రిమాండ్ కు కూడా పంపింది. ఇదే క్రమంలో విచారణలో రూ.27 కోట్ల మేర డబ్బులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కూడా కోర్టుల్లో సమర్పించింది. ఇప్పుడు ఈ మొత్తం లావాదేవీలకు సంబంధించిన వివరాలు కోరుతూ టీడీపీకి సీఐడీ నోటీసులు జారీ చేసింది.
స్కిల్ కేసులో భాగంగా టీడీపీకి అందిన రూ.27 కోట్ల మొత్తానికి సంబంధించిన జరిగిన లావాదేవీల వివరాలు ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు ఇవాళ ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వెళ్లి కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు ఈ నోటీసులు అందజేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నేపథ్యంలో పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని ఈ నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.

మరోవైపు స్కిల్ కేసులో సీఐడీ అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఇప్పటికే టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సీఐడీ జారీ చేసిన నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ రూ.27 కోట్ల మొత్తం తమ పార్టీకి ఎన్నికల విరాళంగా వచ్చిందని గతంలోనే టీడీపీ నేతలు ప్రకటించారు. ఇప్పుడు దాన్ని స్కిల్ కేసులో తమకు అందలేదని నిరూపించుకోవాల్సి ఉంది. లేకపోతే కోర్టుల్లో సీఐడీ తమ వాదన ప్రకారం స్కిల్ కేసులో అవినీతిగానే చెప్పబోతోంది.
అటు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్ లో ఉంది. దీపావళి సెలవుల తర్వాత ఈ తీర్పు ప్రకటిస్తామని సుప్రీంకోర్టు ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో స్కిల్ కేసులో అవినీతిని నిరూపించేందుకు సీఐడీ జారీ చేసిన నోటీసులకు ప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications