తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం, జూన్ 23 నాటికి నైరుతి రుతుపవనాలు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి రాబోయే నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురిపించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది .
నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఇక ఈరోజు వాతావరణ పరిస్థితి విషయానికి వస్తే ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో కొన్ని చోట్ల చెల్లాచెదురుగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అయితే ఇవి తీవ్రమైన వర్షాలు కాకుండా, స్థానికంగా పరిమితమైనవే అని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు ఇప్పటికీ పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపారు.

తెలంగాణాలో వర్షపాతంలో భారీ లోటు
ప్రస్తుతం తెలంగాణలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సగటు 63 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 51 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో సుమారు 20 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో 77 శాతం, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో కూడా భారీ లోటు నమోదైంది.
రైతులు వ్యవసాయం విషయంలో జాగ్రత్త
ఈ పరిస్థితి కారణంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగి, ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో వర్షాలు సమృద్ధిగా కురిసి నేల తేమగా మారిన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తొందరపాటుగా విత్తనాలు వేస్తే ఎండల తీవ్రత వల్ల మొలకలు బయటకు రాకుండానే నశించే ప్రమాదం ఉంది. రుతుపవనాలు ఆలస్యంగా వస్తున్న నేపథ్యంలో రైతులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈశాన్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
మరోవైపు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించాయి. జూన్ 23 తర్వాత తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా వర్షాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఈశాన్య భారతదేశంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు సకాలంలో కురిస్తే వ్యవసాయం, నీటి సమస్యలు కొంతవరకు తీరవచ్చు.












Click it and Unblock the Notifications