చంద్రబాబు ఆదేశాలు..మనోహర్ శాఖ బేఖాతర్..!!
ప్రభుత్వ ఆదేశాలను పౌరసరఫరాల శాఖ అమలు చేయటం లేదు. పేదలకు ప్రభుత్వం అందించాలని నిర్ణయించిన సరుకులు అందకుండా భారీ షాక్ ఇస్తోంది. ఆగస్టు నుంచే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు రాయితీపై కందిపప్పు, పంచదారను కూడా సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. కానీ, నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్న పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
బియ్యం మాత్రమే
ఏపీలో ఈ నెల నుంచి రేషన్ సరుకుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు రాయితీపై కందిపప్పు, పంచదారను కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, వచ్చే నెల సెప్టెంబర్ కోటాలో కూడా రేషన్ సరుకుల్లో కూడా కందిపప్పు, పంచదార ఉండదు. సెప్టెంబరు కోటాలో కూడా కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 దాటిపోగా... పంచదార కిలో దాదాపు రూ.50కు చేరువైంది.

ప్రభుత్వం ఆదేశించినా
దీంతో, ప్రభుత్వం వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తామని చెప్పటంతో ప్రభుత్వం రేషన్ ద్వారా కిలో కందిపప్పు సబ్సిడీపై రూ.67కి, పంచదార రూ.17కే అందిస్తుందని పేదలైన కార్డుదారులంతా గంపెడాశలు పెట్టుకున్నారు. ఆగస్టు నుంచి అక్టోబరు వరకు 3 నెలలకు సరిపోయేలా మొత్తం 22,500 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 17,538 మెట్రిక్ టన్నుల పంచదార సేకరణ కోసం పౌరసరఫరాల సంస్థ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా గత జూలై నెలలో టెండర్లు ఆహ్వానించింది.
ఏం జరుగుతోంది
జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి అనుమతులు లభించిన తర్వాత కూడా కందిపప్పు టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లకుండా పౌర సరఫరాల శాఖ నిలిపివేసింది. చక్కెర సరఫరాదారులు ఎక్కువ ధరలు కోట్ చేశారనే కారణంతో అధికారులు ఆ టెండరును రద్దు చేసేశారు. దీంతో, గత రెండు నెలలుగా రాష్ట్రం మొత్తంగా పంచదార పంపిణీని కూడా నిలిపివేశారు. వచ్చేనెల వినాయక చవితి పండగకు పేదలకు పప్పు, పంచదార ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications