కేసీఆర్ తిట్ల దండకంపై స్పందించిన చంద్రబాబు...పరుష పదజాలం సరికాదు;భయపడను:చంద్రబాబు
తిరుపతి:టిఆర్ఎస్ నల్గొండ సభలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఉద్దేశించి చేసిన ఘాటు విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిస్పందించారు. తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కెసిఆర్ వ్యాఖ్యలపై గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
"నేను విధానాలు, సిద్ధాంతాలపైనే మాట్లాడతాను. వ్యక్తిగతంగా మాట్లాడను. పరుష పదజాలంతో మాట్లాడటం నా పద్ధతి కాదు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరికీ మంచిది కాదు. గుప్పిట మూసి ఉన్నంత వరకే మర్యాద. ఆ తర్వాత ఎవ్వరికీ మర్యాద కాదు. నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. దానిని కాపాడుకుంటాను. ఏదంటే అది మాట్లాడి నాలుక్కరుచుకునే అలవాటు లేదు''...అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కెసిఆర్ తిట్లపై...చంద్రబాబు స్పందన
తెలంగాణా సిఎం కెసిఆర్ నల్గొండ సభలో తనపై చేసిన ఘాటు వ్యాఖ్యలు, ప్రయోగించిన తిట్ల దండకంపై తిరుపతి పర్యటనలో ఉన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు
స్పందించి మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉండకూడదు? నన్ను ఎందుకు తిట్టాలి? నేను చేసిన తప్పేమిటి? తెలుగు వారు సామరస్యంగా ఉండాలని కోరుకోవడం నా తప్పా? హైదరాబాద్ అభివృద్ధికి రాత్రింబవళ్లు తిరిగి కష్టపడటం నా తప్పా? ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని బాబ్లీపై పోరాటం చేయడం తప్పా?''...అని చంద్రబాబు ఈ సందర్భంగా తెలంగాణా సిఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

బిజెపి కుట్ర...అందుకే ఆ ముగ్గురు
తనపై విమర్శల దాడి వెనుక బిజెపి ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేసీఆర్, జగన్, పవన్ కలిసి బీజేపీతో కుమ్మక్కయ్యారని, బయట నాటకాలాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే తాను చేసిన తప్పా? బాబ్లీకోసం పోరాడటం తప్పా?, తెలుగు ప్రజల సంక్షేమం కోరుకోవడం తప్పా? అని చంద్రబాబు నిలదీశారు. నేను చేసిన తప్పేంటో తెలుగు ప్రజలు ఆలోచించాలన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కెసిఆర్...వినడం లేదు
కెసిఆర్ నేరుగా తనను టార్గెట్ చేసి ప్రయోగించిన ఘాటైన వ్యాఖ్యల గురించి చంద్రబాబు మాట్లాడుతూ...‘‘రెండు రాష్ట్రాలకు తగవు వద్దంటే అక్కడి సీఎం వినడంలేదు. హైదరాబాద్ వదిలి వెళ్లాలన్నప్పుడు అందరి కంటే ఎక్కువ బాధ పడ్డా. కానీ వాళ్లు నా తెలుగు వాళ్లే అనే ఒక్క కారణంతో వచ్చేశా. నన్ను గెలిపించిన ప్రజల కోసం మరో నగరం కట్టుకుంటే కేంద్రం అణచివేస్తోంది. పక్క రాష్ట్రం సహకరించాల్సింది పోయి బీజేపీ ఆదేశాలతో నాపైనే దాడి చేస్తోంది. నాకు పాలసీలు చేయడం తప్ప.. దిగజారి మాట్లాడటం రాదు. తొందరపడి నోరు జారడం.. తిరిగి వెనక్కు తీసుకోవడం నాకు రాదు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా...ఏనాడు పరుష పదజాలం వాడలేదు. మోడీని చూసి భయపడాల్సిన అవసరం నాకు లేదు''...అని చెప్పారు.

అప్పుడు...నన్ను తెగ పొగిడారు
ఇప్పుడు పరుష వ్యాఖ్యలతో నిందిస్తున్న కెసిఆర్ గతంలో తన గురించి ఎలా పొగిడారో చంద్రబాబు గుర్తు చేశారు. "ఇదే కేసీఆర్ 2009 ప్రచార సభల్లో తనను ఎలా పొగిడారో గుర్తుకు తెచ్చుకోండి. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లే జరిగిందని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులూ బాహాటంగా అంగీకరించారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీని కార్నర్ చేయాలనే కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను వదిలి వెళ్తున్నందుకు బాధ అనిపించదా?...నేను తెలుగు వారి కోసమే చేశాను. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని వారే అనుభవిస్తున్నారు. రాష్ట్రవిభజన తర్వాత మరో నగరాన్ని నిర్మించాల్సిన బాధ్యత నాకు అప్పగించారు. అందుకే అమరావతికి వచ్చాను. ప్రతిరోజూ కొట్టుకుంటే అనవసరమైన విద్వేషాలుంటాయని, సామరస్యంగా పరిష్కరించుకుందామని భావించాను''...అని చంద్రబాబు అన్నారు.

మోడీ అంటే...నాకెందుకు భయం
టిడిపిని తెలంగాణా నుంచి తోసివేయాలనే కుట్రలో భాగంగా కెసిఆర్ ఇలా మాట్లాడుతున్నారన్నారు. ‘‘వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు వదులుకోవాలి?...కొన్ని వేల మందికి రాజకీయ భవిష్యత్తు అందించిన టీడీపీ ఉనికిలోనే ఉండకూడదంటే ఎలా?'' ...బీజేపీతో టీడీపీ కలిసి ఉన్నప్పుడే టీఆర్‌ఎస్, వైసీపీ పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశాయి...ఇదేం నైతికత...బీజేపీతో మేము కలిసి ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్‌ఎస్ కూడా కోరిందని...బీజేపీతో విభేదించగానే... కేసీఆర్, జగన్, పవన్ తనను టార్గెట్ చేసుకున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ముగ్గురూ బీజేపీ డైరెక్షన్‌లో పని చేస్తున్నారన్నారు. మోడీని చూస్తే నాకెందుకు భయమని చంద్రబాబు ప్రశ్నించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!