ఆటో డ్రైవర్ రజనీకాంత్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తరచూ చెప్తున్న మాట తనలో మార్పు చూస్తారని. అన్నట్లుగానే ఆయన తన మార్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా గుడివాడ పర్యటన సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ తో ముచ్చటించారు. ఆయన కష్టాలను తెలుసుకున్నారు. అవి తీరాలంటే ఏం కావాలని అడిగారు. ఆటోడ్రైవర్ చెప్పిన విషయం విని ఓ హామీ ఇచ్చారు. రాజకీయ నాయకులంటే ఇదంతా సహజమే అని ఆ ఆటోడ్రైవర్ కూడా వదిలేశాడు. కానీ చంద్రబాబు ఆ హామీ నిలబెట్టుకున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలో రామబ్రహ్మం పార్కులోని అన్న క్యాంటీన్ న్ను సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజినీకాంత్ తో చంద్రబాబు మాట్లాడారు. ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని అతను ముఖ్యమంత్రికి తెలిపాడు. కొడుకు రవితేజ మాట్లాడుతూ తాను ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లి బీడీఎస్ చదువుకు అండగా ఉంటున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే రజనీకాంత్ కు చంద్రబాబు ఓ హామీ ఇచ్చారు.

ముందు తన ఆటోను విద్యుత్ వెర్షన్ కు మార్చుకుంటే ఎంతవుతుందని చంద్రబాబు రజనీకాంత్ ను అడిగారు. 4 లక్షల వరకూ అవుతుందన్నాడు. కానీ సాధారణ ఆటోను విద్యుత్ ఆటోగా మార్చే పరిస్ధితి లేదని అధికారులు చెప్పడంతో కొత్తగా 4 లక్షలతో ఆటో కొనివ్వాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో అధికారులు ఆఘమేఘాల మీద స్పందించారు.
ఈ క్రమంలో 48 గంటల్లోనే అతనికి కలెక్టర్, ఆర్డీవో కలిసి కొత్త విద్యుత్ ఆటోను అందించారు. తన జీవితంలో చాలా మంది నేతలను చూశాను కానీ చంద్రబాబు లాంటి నేతను ఎన్నడూ చూడలేదని ఆటో డ్రైవర్ రజనీకాంత్ తెలిపాడు. ఆయన రుణం తీర్చుకోలేమన్నాడు. ఆయన చేసిన మేలును తమ కుటుంబం ఎప్పుడూ మరచిపోదన్నారు. గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చడం నమ్మలేకపోతున్నట్లు ఆటో డ్రైవర్ రజినీ కాంత్ సంతోషం వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications