ఆంధ్రప్రదేశ్ బాధ్యతను ఆమ్రపాలిపై పెట్టిన చంద్రబాబు!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి కాట ఆమ్రపాలి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. నాలుగు రోజుల తర్వాత తెలంగాణ వచ్చిన ఐఏఎస్ లందరికీ ఏపీ ప్రభుత్వం బాధ్యతలు కేటాయించింది. ఇందులో భాగంగా ఆమ్రపాలికి ఏపీ టూరిజం ఎండీగా, అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆమ్రపాలికి టూరిజం ఇవ్వడం వెనక చంద్రబాబు ఎంతో కసరత్తు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ఆదాయ వనరుల్లో టూరిజంది ప్రధాన పాత్ర. ఏపీలో టూరిస్టులు సందర్శించే ప్రాంతాలతోపాటు ఇంకా వారికి తెలియనివి కూడా ఎన్నో ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు కూడా టూరిస్టులను రప్పించగలిగితే మరికొంత ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది.
ప్రపంచ పటంలో నిలుపుతారని ఆశిస్తూ..
సమర్థవంతమైన అధికారిణిగా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలి టూరిజంద్వారా నవ్యాంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో నిలిపేలా చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ శాఖకు మంత్రిగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్ ఉన్నారు. రాజధాని అమరావతికి సమీపంలోని ఉండవల్లి గుహలు, ఆ గుహల్లో అనంతపద్మనాభస్వామి నిద్రిస్తుంటాడనే విషయం, గుంటూరుకు సమీపంలోని చేబ్రోలులో బ్రహ్మదేవుడి ఆలయం, కొండవీడు రాజులు పరిపాలించిన కోట ఉందనే విషయం రాష్ట్రంలోనేకాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువమందికి తెలియదు. అంతేకాదు.. అమరావతిలోని బౌద్ధ ధ్యాన స్థూపానికి దేశ, విదేశాల నుంచి బౌద్ధులు తరలివస్తారుకానీ ఇతర మతాలకు చెందినవారు రావడం తక్కువ. వారిని కూడా ఆకర్షించగలిగితే ఆదాయం పెరుగుతుంది. తాజాగా కృష్ణా నదిలో సీప్లేన్ ప్రారంభించారు. ఈ తరహాలో సరికొత్త సౌకర్యాలను టూరిజంశాఖ తీసుకురాగలిగితే దేశ, విదేశాల నుంచి టూరిస్టులను ఆకర్షించడం సులభమవుతుంది.

వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆమెపైనే
ఏపీలో సరైన ఎమ్యూజ్ మెంట్ పార్క్ లేదు. ఇక్కడి ప్రజలు తమ చిన్నారులతో హైదరాబాద్ వస్తుంటారు. అటువంటి ప్రాజెక్టును నిర్మించడంతోపాటు రాష్ట్రంలో మరెన్నో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పురాతన ప్రాంతాలు మరుగున పడివున్నాయి. వాటన్నింటిని మంత్రి సహకారంతో అభివృద్ధి పరిచి వెలుగులోకి తీసుకురావల్సిన బాధ్యత ఆమ్రపాలిపై ఉంది. ఒకరకంగా ఈ పదవి ఆమెకు కత్తిమీద సాములాంటిదే. రాజధాని పరిసర ప్రాంతాల్లోనే రాష్ట్ర ప్రజలకు తెలియని ప్రాంతాలు ఇన్నివుంటే రాష్ట్రవ్యాప్తంగా తెలియని ప్రాంతాలు ఇంకెన్ని ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రానికి టూరిస్టులను ఆకర్షించడంద్వారా, టూరిజాన్ని అభివృద్ధి పరచడంద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఏపీ టూరిజంలో ఉన్న విశేషాలకు ప్రాచుర్యం కల్పించడంద్వారా ఆంధ్రప్రదేశ్ కు పేరు తీసుకురావల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమ్రపాలిపై ఉంచారు.












Click it and Unblock the Notifications