రేవంత్ ఇష్యూ: బాబును ఏసీబీ విచారిస్తుందా..?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబుకు చిక్కులు తప్పవా అంటే తప్పవనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబుని విచారించేందుకు ఏసీసీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబుకు ఏసీబీ అధికారులు ఈ వారం చివరలో లేదా వచ్చే వారం మొదట్లో నోటీసులిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నోటీసులకు ఏపీ సీఎం స్పందించకపోతే, ఏసీబీ అధికారులు నేరుగా ఆయన నివాసానికి వెళ్లి విచారించనున్నట్లు తెలుస్తోంది.

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ. 50 లక్షలు లంచం ఇస్తూ రెడ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రధారి ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. వీటికి తోడు రేవంత్ రెడ్డి పక్కా ఆధారాలతో దొరికి పోవడం ఏసీబీకి చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.
రేవంత్ రెడ్డితో పాటు మధ్యవర్తిగా ఉన్న సెబాస్టియన్ ఫోన్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులను ఏసీబీ అధికారులు ఇప్పటికే పరిశీలించి తెలంగాణ ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ నేత రేవంత్ రెడ్డి పట్టుబడిన వీడియోలో బాస్ చెపితే వచ్చానని కొన్నిసార్లు, బాబుగారు అని మరికొన్ని సార్లు, చంద్రబాబు అన్ని రెండు మార్లు సంభాషణల్లో ఉంది.
ఈ ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని ఏసీబీ అనుమానించడంతో ఆధారాలను పక్కాగా సేకరిస్తున్నారు. ఈ ఆధారాలతోనే చంద్రబాబును ఏసీబీ విచారించేందుకు గవర్నర్ అనుమతిని కూడా కోరనున్నట్లు తెలుస్తోంది. ఆడియో, వీడియో రికార్డులను ఇప్పటికే ఏసీబీ గవర్నర్‌కు అందజేసింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నింటిని ఏసీబీ చాలా గోప్యంగా ఉంచుతుంది. ‘ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందువల్ల ఎలాంటి సమాచారం కూడా లీక్ కాకుండా మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం. కోర్టుకు ఇచ్చే ప్రతి సమాచారం కూడా అన్ని ఆధారాలతో కూడినదై ఉండాలన్నదే మా అభిమతం..' అని ఏసీబీ వర్గాలు అంటున్నాయి.
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన మొత్తం సంభాషణలను ఒకచోటకు చేర్చి, గురువారం లేదా శుక్రవారం ఏసీబీ అధికారులు కోర్టుకు అందజేనున్నారు. ఇక, చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఫోన్లను ఇంటెలిజెన్స్ ట్యాప్ చేసినట్లు బుధవారం సాయంత్రం మీడియాలో వార్తలు వచ్చాయి.
ఓటుకు నోటు కేసులో జైలు పాలైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కోర్టు శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications