సంప్రదాయాలకు తెర.. విధానాలకు పాతర.. విస్తరణపై బాబు వాదనలు.. జగన్ అవగాహనా రాహిత్యం

న్యూఢిల్లీ/ హైదరాబాద్ / అమరావతి: వారం క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ తీరు.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అందులో చోటు కల్పించిన తీరుపై తెలుగు నేలతోపాటు జాతీయ స్థాయిలో రసవత్తర చర్చ జరుగుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పేరులో 'చంద్ర' నామం ఉన్నా మండువేసవిలో సూర్య భగవానుడిలా భగభగ మండిపడుతున్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు ఏర్పాటైనా కొన్ని సంప్రదాయాలు, శాసన వ్యవస్థలో పద్ధతులు అవలంభిస్తూ వచ్చిన సందర్భాలే నాటికీ నేటికీ ఆచరణీయమే. కానీ తాజా మంత్రివర్గ విస్తరణ ద్వారా తనయుడికి వారసత్వ పగ్గాలు అప్పగించేందుకు పూనుకున్న చంద్రబాబు.. భావి రాజకీయ ప్రయోజనాల రీత్యానే వైరి పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కానీ కేబినెట్ కూర్పు సీఎం ఇష్టమని, ఎవరినైనా తీసుకునే విచక్షణాధికారం ఏపీ సీఎంగా తనకు ఉందని చెప్తున్నారు.

చంద్రబాబు ఏకపక్ష వైఖరి ఇలా..

చంద్రబాబు ఏకపక్ష వైఖరి ఇలా..

దీనికి తోడు సర్వతోముఖ రాష్ట్ర ప్రగతి నినాదాన్ని సముద్ర తీరం ‘విశాఖ పట్నం'లో ముందుకు తెచ్చారు. రాష్ట్ర ప్రగతి సాధించాలంటే శాశ్వతంగా ఒక్క పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలని వాదం తేవడంలో పరమార్థం ఏకపక్ష ధోరణిని భావనను వ్యక్తీకరిస్తున్నారని రాజకీయ, రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలన్న సంగతిని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. 1995 - 2004 మధ్యకాలంలో మాదిరిగానే అధ్యక్ష తరహా పాలన అవసరమన్న వాదనను మరోసారి పరోక్షంగా తీసుకొస్తున్నారని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

తెలంగాణ, ఏపీ పరిస్థితులు వేర్వేరని వింత వాదన

తెలంగాణ, ఏపీ పరిస్థితులు వేర్వేరని వింత వాదన

తెలంగాణ మంత్రివర్గంలోకి తలసాని శ్రీనివాస యాదవ్‌ను తీసుకున్న నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరని మరో వింత వాదనను ఏపీ సీఎం చంద్రబాబు తీసుకొస్తున్నారు. కానీ ఒక సంగతి విస్మరించారు.. కాదు కాదు ఉద్దేశ పూర్వకంగా దాటేస్తున్నారు. నాడు తెలంగాణ సీఎం కేసీఆర్.. కేబినెట్ విస్తరణలో తలసానికి చోటు కల్పించే ముందు సనత్ నగర్ ఎమ్మెల్యే పదవికి తలసానితో రాజీనామా చేయించారు. అది ఇప్పటికీ శాసనసభ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి వద్దే పెండింగ్‌లో ఉన్నది. దీనికి తోడు తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అంతేకాదు టీటీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ కు నాటి టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ అందజేశారు. ఈ సంగతులన్నీ చంద్రబాబు గారికి తెలుసు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై బాబు ఇలా

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై బాబు ఇలా

కానీ ఏపీ కేబినెట్‌లోకి నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు కల్పించిన తర్వాత వారం రోజులకు గానీ ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, అవి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఆయన నిర్ణయమే ఫైనల్ అనే వ్యాఖ్యలు తాజాగా చేశారు. తెలంగాణలో మంత్రిగా ప్రమాణం చేయడానికి ముందే తలసాని తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు, రాజీనామా ప్రతిని స్పీకర్‌కు పంపుతున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారెవ్వరూ తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. తాజాగా చంద్రబాబు చేస్తున్న వాదన ఆత్మరక్షణ కోసమే ఎదురు దాడి ప్రక్రియ తప్ప మరొకటి కాదని రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా అంటున్నారు.

ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులపై ఏపీ మంత్రి ఇలా

ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులపై ఏపీ మంత్రి ఇలా

ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో సభ్యుడిగా చేరిన సుజయ క్రుష్ణ మరో వాదన ముందుకు తెచ్చారు. నాడు కాంగ్రెస్ పార్టీలో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని కోరలేదని వింత వాదన మొదలు పెట్టారు. కానీ నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన తర్వాత నాటి స్పీకర్ నాదేండ్ల మనోహర్.. నాటి అదికార కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు అనర్హత వేటేశారు. దీనిపై దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి లా పాయింట్లు లేవనెత్తడంతో ఆమెపై అనర్హత వేటు విధించే అంశంపై భిన్నమైన తీర్పు ఇచ్చిన సంగతి ప్రస్తుత ఎపీ మంత్రి సుజయ్ క్రుష్ణ మరిచిపోయారో మరి తెలిసినా గుర్తున్నా.. ఒకనాటి తమ అధినేత.. ప్రస్తుతం వైరిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఉద్దేశ పూర్వకంగా విమర్శలకు పూనుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

కేబినెట్ విస్తరణపై ఇలా బాబు..

కేబినెట్ విస్తరణపై ఇలా బాబు..

మంత్రివర్గ విస్తరణ వరకు మౌనంగా ఉన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తర్వాత తమ నిరసన గళం గట్టిగానే వినిపిస్తున్నారు. మరోవైపు బాబు సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆ వర్గం వారిలో సహజంగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని విశ్లేషకులు అంటున్నారు. సొంత సామాజికవర్గం వారి ఆగ్రహాన్ని కట్టడి చేయలేక సతమతం అవుతున్నందువల్లే అలిగిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తాను మంత్రి పదవి ఎలా ఇవ్వాలని ఎదురు ప్రశ్నించారు. ఆయన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత కూడా గోరంట్లకు కేబినెట్ బెర్త్ కల్పించాలా? అని నిలదీస్తున్నారు.

చంద్రబాబుకు రుచించని విపక్షం, మిత్రపక్షం వైఖరి

చంద్రబాబుకు రుచించని విపక్షం, మిత్రపక్షం వైఖరి

2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్న మాట వాస్తవమే గానీ, వారెవ్వరికీ కేబినెట్‌లో చోటు కల్పించనే లేదు. కానీ చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అదేమిటని ప్రశ్నించిన వారిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. సొంత పార్టీలో, సొంత సామాజిక వర్గం నుంచి విమర్శలెదురవుతుండటంతోపాటు మిత్రపక్షం బీజేపీ కూడా చంద్రబాబు నిర్ణయాలను బహిరంగంగానే ప్రశ్నించడం తెలుగుదేశం పార్టీ అధినేతకు రుచించడం లేదు.

వైఎస్ జగన్ జాతీయ ప్రచారంపై బాబు ఇలా..

వైఎస్ జగన్ జాతీయ ప్రచారంపై బాబు ఇలా..

ఇక సహజంగానే వైరి పక్షం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడుతుండటంతో ఇటు టీడీపీ, అటు వ్యక్తిగతంగా చంద్రబాబు ప్రతిష్ఠ మసకబారుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి, కేంద్రమంత్రుల వరకు ప్రతి ఒక్కరినీ కలుస్తూ చంద్రబాబు ఇష్టారాజ్యంగా సాగిస్తున్న కళంకిత రాజకీయ వ్యవహారశైలిని ఎండగడుతుండటంతో ప్రతిపక్ష నేతకు అపాయింట్ మెంట్లు ఎలా ఇస్తారని లా పాయింట్లు తీస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.

కేసులపై బాబు ఇలా..

కేసులపై బాబు ఇలా..

ఆర్థిక నేరస్థుడు వైఎస్ జగన్ అనే వాదన ముందుకు తెస్తున్నారు. ఆ మాట కొస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే పెద్ద ఆర్థిక నేరస్తుడని విమర్శలు ఉన్నాయి. 2015లో ఓటుకు నోటు కేసు మొదలు 1998లో ఏలేరు భూ కుంభకోణం.. బిగ్ బాస్ వరకూ దరిదాపుగా 14 కేసులు చంద్రబాబుపై నమోదై ఉన్నాయి. వాటిల్లో ఏ న్యాయస్థానంలోనూ చంద్రబాబు సచ్ఛీలుడని తీర్పులివ్వలేదు. ఏలేరు కుంభకోణంపై ఏర్పాటైన కమిషన్ విచారణ మొదలు ప్రతి కేసులోనూ విచారణ మందుకు వెళ్లకుండా స్టే తెచ్చుకున్న నేపథ్యం ఏపీ సీఎం చంద్రబాబుదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

విజయమ్మపై టీడీపీ నేతల ముప్పేట దాడి ఇలా..

విజయమ్మపై టీడీపీ నేతల ముప్పేట దాడి ఇలా..

అన్నింటికి మించి 2014కు ముందు చంద్రబాబు అక్రమాస్తులపై వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయ లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే.. అనూహ్య రీతిలో ఈనాడు అధినేత రామోజీరావు నుంచి ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు తదితరులు ఇంప్లీడ్ అయి.. ఈ కేసు విచారణకు అనర్హమని వాదన తీసుకొచ్చారు. దానికి చంద్రబాబు అధికారానికి దూరంగా ఉన్నప్పుడు అవినీతి ఎక్కడ జరుగుతుందన్న వాదనను ముందుకు తీసుకొచ్చారు. చివరకు న్యాయస్థానం విచారణ దశలో ‘బిఫోర్ నాట్ మీ' అనే పేరుతో విచారణ వాయిదాలు పడింది. చివరకు విజయలక్ష్మి పిటిషన్ విచారణకు అర్హం కాదని, పోలీసు కేసు నమోదు కాలేదని కొట్టి పారేశారు.

ఏసీబీ విచారణకే ‘ఓటుకు నోటు' పరిమితం

ఏసీబీ విచారణకే ‘ఓటుకు నోటు' పరిమితం

గమ్మత్తేమిటంటే తెలంగాణలో వెలుగుచూసిన ‘ఓటుకు నోటు' కుంభకోణంలో బాబు పాత్ర తెలుగు నేలపై ప్రజలంతా స్వయంగా వీనుల విందుగా వీక్షించారు. కానీ దీని దర్యాప్తుపై ఏసీబీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే రామక్రుష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

జగన్ పై బాబు అసత్య ప్రచారం తీరిది..

జగన్ పై బాబు అసత్య ప్రచారం తీరిది..

కానీ వైఎస్ జగన్ ను పదేపదే ఆర్థిక నేరస్తుడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదలు ఆయన పార్టీ నేతలు, మంత్రులు పదేపదే అడ్గగోలు వాదన తీసుకొస్తున్నారు. తద్వారా న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా న్యాయస్థానం తీర్పు చెప్పే వరకూ అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ నిందితులే తప్ప నేరస్థులు కాదు. వైఎస్ జగన్మోహన రెడ్డిపై నమోదైన కేసుల్లో ఏ ఒక్కదాంట్లో కూడా న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించలేదు. కానీ పదేపదే జగన్మోహన రెడ్డి ఆర్థిక నేరస్తుడని ‘గోబెల్స్' ప్రచారం చేయడం ద్వారా న్యాయవ్యవస్థను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించేందుకు ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు.

బాబు దాడిపై ప్రతిదాడిలో ఏపీ ప్రతిపక్ష నేత విఫలం తీరు ఇలా..

బాబు దాడిపై ప్రతిదాడిలో ఏపీ ప్రతిపక్ష నేత విఫలం తీరు ఇలా..

దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగానీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి గానీ న్యాయస్థానాల్లో పరువు నష్టం దావాలు దాఖలు చేయొచ్చు. కానీ ఆ పని చేయలేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ఒంటెద్దు పోకడలు, అనుభవ లేమి, బాధ్యతారాహిత్యం, ముందుచూపు లేకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించగలుగుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదేపదే ఆరోపణలు చేస్తున్నందుకు జగన్మోహన రెడ్డి పరువు నష్టం దావా వేయడం వల్ల రాజకీయంగా కూడా ప్రతిపక్ష నేతకు లబ్ది చేకూరుతుందని పలువురు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా ప్రజల్లోకి మరింతగా చొచ్చుకు వెళ్లే అవకాశాన్ని వైఎస్ జగన్మోహనరెడ్డి చేజేతులా వదులుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+