కాకినాడ అభివృద్ధికి వాళ్లే అడ్డు, ఒక్క సీటు కూడా రాకూడదు, బుద్ధి చెప్పండి: సీఎం చంద్రబాబు
కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. శనివారం ప్రచారంలో భాగంగా ఆయన కాకినాడ నాగమల్లితోట రోడ్‌షోలో మాట్లాడారు.
కాకినాడ: కాకినాడ అభివృద్ధికి నిరంతరం అడ్డుపడుతున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కాకినాడ నాగమల్లితోటలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు.
కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ హయాంలో కాకినాడ నగరాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు విమర్శించారు. మంచి పట్టణంగా తయారయ్యేందుకు అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నారు. కాకినాడను ఆకర్షణీయ పట్టణంగా తయారుచేస్తామని చెప్పారు.
నగర యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తామని సీఎం అన్నారు. సెజ్‌లలో పరిశ్రమలు వస్తే కాకినాడ దశదిశ మారిపోతుందన్నారు. నగరాన్ని విద్యా కేంద్రంగా తయారుచేస్తామని, మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని తెలిపారు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని, ఎక్కడా మురుగు లేకుండా రహదారులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019 నాటికి ప్రతి ఇంటికీ నిరంతరం తాగునీరు ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.
వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించండి..
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన ఇష్టానుసారంగా చంపాలి.. కాల్చాలి అంటూ మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. రౌడీయిజం, గూండాయిజానికి ఎక్కడా చోటు ఉండకూడదన్నారు. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టుల నిర్మాణాన్ని, అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి ఆ పార్టీ అడ్డంకిగా మారిందని విమర్శించారు. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని, డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు బుద్ధి చెప్పాలని సీఎం చంద్రబాబునాయుడు కోరారు.












Click it and Unblock the Notifications