గొడవలతో అందరం నష్టపోతాం: ఎంత భూమి అవసరమో అంతే తీసుకున్నామన్న ఏపీ సీఎం
హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎంత భూమి అవసరమో అంతే తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ రాజధాని కోసం భూములిచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. రైతుల నుంచి తీసుకున్న భూమికి వారు సంతృప్తి చెందేలా పరిహారం ఇస్తున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కింది భూములను సేకరించామని చెప్పిన చంద్రబాబు, రూ. 24 వేల కోట్లు రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రైతులను రుణ విముక్తుల్ని చేశామని ఆయన వ్యాఖ్యానించారు. రైతులను విడతల వారిగా రుణ విముక్తులను చేయనున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, ఎన్ని సమస్యలు వచ్చినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు.

ఏపీ, తెలంగాణల మధ్య చోటు చేసుకుంటున్న విభేదాలపై కూడా ఆయన స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తే అందరం నష్టపోతామని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఇక్కడ సాధ్యం కాని సమస్యను కేంద్రం పరిష్కరించాలని వ్యాఖ్యానించారు.
కేంద్రం కూడా ఇరు రాష్ట్రాల మధ్య వచ్చిన సమస్యలను ఉదారంగా పరిష్కరించాలని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతోన్న సమస్యలను ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకుంటే బాగుంటుందని చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications