చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ల్లో సోది ఎక్కువైంది: అధికారుల బెంబేలు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతివారం నిర్వహించే టెలీకాన్ఫరెన్సులతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు గంటసేపు ప్రసంగిస్తారు. అయితే కొత్తగా ఏమైనా చెబుతారా... అంటే, కొత్తదనం లేకపోవడం, చెప్పిందే చెప్పడం, పనికొచ్చే సూచన ఒక్కటీ లేకపోవడంతో సీఎం కాన్ఫరెన్సులు బోరు కొట్టిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
దీంతో సీఎం నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్‌లన్నింటిపై ఇలాంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సోమవారం వస్తోందంటే చాలు వ్యవసాయశాఖ అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఆ రోజు బాబు నిర్వహించే కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడిన గంటసేపు సోదే ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కాలంలో ఇది కాస్త మితిమీరడంతో అసలు ప్రయోజనాలు పక్కకుపోయి మొక్కబడిగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం తీరుతో అధికారులు, నేతలు కూడా వాటిని అంతగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అధికారులే కాదు నేతలు సైతం వాటిని తేలిగ్గా తీసుకొంటున్నారని, బహిరంగంగా విసుగు ప్రదర్శిస్తున్నారన్నారు.

వృథా అవుతోందనే విమర్శలు
నిజానికి సమయం, డబ్బు వృథాని నివారించడమే టెలీకాన్ఫరెన్సుల ముఖ్య ఉద్దేశం. కానీ సీఎం చంద్రబాబు నిర్వహించే టెలీకాన్ఫరెన్సులతో దేని వృథాను తగ్గించాలని అనుకుంటున్నారో అదే వృథా అవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెక్నాలజీని వాడుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడే ఈ టెలి కాన్ఫరెన్సులను ప్రారంభించారు. 2019లో అధికారం చేపట్టిన తర్వాత వీటి జోరు మరితంగా పెంచారు.

లక్ష్యం వేరు
వీటిని మొదలు పెట్టినప్పుడు అనుకొన్న లక్ష్యం వేరు. జిల్లాల్లో ఉన్న అధికారులంతా ముఖ్యమంత్రి వద్దకు వచ్చి సమీక్షలకు హాజరు కావాలంటే అందరి సమయం వృథా అవుతోందని, దాని బదులు అదే సమీక్షను ఫోన్లో నిర్వహిస్తే సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని మొదట అనుకొన్నారు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇవి నడుస్తున్నాయి. టెలికాన్ఫరెన్స్‌లలో సీఎం ఒక గంట లేదా గంటన్నర ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలపాటు చర్చ జరుగుతుంది. ఈ టెలికాన్ఫరెన్స్‌లలో అందులో మహా అంటే ముగ్గురు నలుగురు అధికారులు పాల్గొంటున్నారు. వారు కూడా అర్థవంతమైన అంశాలు లేవనెత్తడానికి బదులు ముఖ్యమంత్రిని ప్రస్తుతించడానికి, అంతా బాగా జరుగుతోందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ టెలికాన్ఫరెన్స్ లకు ప్రజా ప్రతినిధులంతా కూడా దూరంగానే ఉంటున్నారు.

పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్‌లు
కృష్ణా పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించేవారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకొని కింది స్థాయిలో సర్పంచులు, ఎమ్మార్వోల వరకూ ఇందులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా టెలికాన్ఫరెన్స్‌ల నిర్వహణకు ఎంచుకున్న సమయంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 8.30 గంటలకు మొదలుపెట్టి, పదింటి వరకు జరుపుతున్నారు. ‘అధికారులకు, ఉద్యోగులకూ కుటుంబాలు ఉంటాయి. పొద్దున్నే స్కూళ్లకు వెళ్లే పిల్లలు ఉంటారు. ఉదయం నడకకో లేదా యోగాకో వెళ్లే వారుంటారు. ఇంత పొద్దున్నే టెలీ కాన్ఫరెన్సులు జరుగుతుండటంతో వారంతా మిగిలిన పనులన్నీ మానేసి ఫోన్ల దగ్గర కూర్చోవాల్సి వస్తోంది' అని వాపోతున్నారు.

ఓ యువ ఎమ్మెల్యే ఇలా అన్నారు
టీడీపీకి చెందిన ఓ యువ ఎమ్మెల్యే చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లపై ‘‘టెలీ కాన్ఫరెన్సుల్లో చర్చ పెరగాలి. కింది స్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి, పరిష్కారాలు సూచించడానికి సీఎం దీనిని వినియోగించుకోవాలి. అందరి ముందూ అటువంటి చర్చ చేయలేమని అనుకొన్నప్పుడు ఆయన నెలకు ఒకసారి మాట్లాడాలి. అప్పుడు ఏం మాట్లాడినా అందరూ ఏకాగ్రతతో వింటారు. మరీ తరచుగా మాట్లాడటం వల్ల శ్రద్ధ పోతోంది. ప్రధాన మంత్రి మన్‌కీ బాత్ కార్యక్రమంలో నెలకు ఒకసారి ఒక అంశం తీసుకొని మాట్లాడతారు. ముఖ్యమంత్రి కూడా అలాగే కొత్త కొత్త అంశాలపై మాట్లాడుతుంటే ఆసక్తి పెరుగుతుంది. ఆయన ఎప్పుడూ చెప్పిన విషయాలనే పదేపదే చెబుతున్నారన్న అభిప్రాయం రావడంతో సీరియ్‌సనెస్ తగ్గుతోంది.'' అని తెలిపారు.












Click it and Unblock the Notifications