30సార్లు ఢిల్లీ వెళ్లా, అందుకే కేబినెట్లో: 'హోదా' వ్యాఖ్యపై బాబు సీరియస్
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి హెచ్‌పి చౌదరి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పడం అన్యాయమని అన్నారు. త్వరలోనే తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని చెప్పారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి చేసే వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఏపీకి నిధుల విషయంలో కేంద్రం సాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు రూ.16వేల కోట్లు ఇస్తామని చెప్పిన కేంద్రం, రూ.2,800 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్రం నుంచి నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై చర్చించేందుకు ఇప్పటికే 30 సార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పారు. ఏపీ ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు కేంద్రం సాయం చేయాలన్నారు.

రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి హెచ్‌పి చౌదరి రాజ్యసభలో మాట్లాడుతూ... ఏపీకి అవసరమైన నిధులు ఇస్తున్నామని, కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పారు. అవసరమైన నిధులు ఇస్తున్నప్పుడు ప్రత్యేక హోదా అవసరం ఏమిటని అన్నారు. దీనిపై ఏపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాను ప్రజల కోసం తప్ప ఏ విషయంలోను రాజీపడనని ఆయన చెప్పారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం కేబినెట్లో ఉన్నాం తప్ప రాజకీయాల కోసం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తద్వారా తాము అవసరమైతే కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications