నన్ను చంపాలని చూశారు.. వారిని రాజకీయాల నుంచి ఊడ్చేయాలి - ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో ప్రజలతో చర్చిస్తూ, తన రాజకీయ ప్రయాణం, భవిష్యత్ లక్ష్యాలు, రాష్ట్ర సుస్థిర అభివృద్ధిపై ఆలోచనలను పంచుకున్నారు. తిరుపతి తనకు ఎంతో ప్రత్యేకమైన స్థలమని, చదువుకుంటూనే తాను ఎమ్మెల్యే అయిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. తనను నక్సలైట్లు చంపాలని చూశారని.. కానీ తిరుమల వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు.
నేరచరిత్ర ఉన్న వారిని ఊడ్చేయాలి..
అంతే కాకుండా తాను ఎప్పుడూ హత్యా రాజకీయాలు చేయలేదని.. అలాంటి ఆలోచనలుంటే చాలా మందిని వదిలి పెట్టేవాడిని కాదని తెలిపారు. ప్రజాసేవే తన ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డిని చంపి గుండె పోటు అంటూ వైసీపీ నేతలు డ్రామాలు ఆడారని ఆరోపించారు. రాజకీయాల్లోకి నేర చరిత్ర ఉన్నవాళ్లు రావడం విషాదకరం అని.. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు రాజకీయాల నుంచి కూడా అలాంటి వారిని ఊడ్చేయాలని అని వ్యాఖ్యానించారు.

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలిజం, ఫ్యాక్షన్ మతకలహాలపై పోరాటం చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చాలంటే ముందు స్వచ్ఛాంధ్రగా తయారు చేయాలని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటికే 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఆగస్టు 15 నాటికి 700 ప్రభుత్వ సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వాతావరణాన్ని కూడా ముందుగా తెలుసుకునేందుకు త్వరలో ఓ యాప్‌ను తీసుకురాబోతున్నామన్నారు. ప్రజలకు సహాయం చేసేలా, డిజిటల్ పాలనను మరింత ప్రజలకు చేరువ చేయడం తన ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా, రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు. సేకరణ, ప్రాసెసింగ్ సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రి నారాయణ, అధికారులు ఉన్నారు.#ChandrababuNaidu… pic.twitter.com/P4GiNhdu3u
— Telugu Desam Party (@JaiTDP) July 19, 2025
భవిష్యత్తు టెక్నాలజీ హబ్‌గా అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మించి, ఏఐ అభివృద్ధికి కేంద్రంగా మార్చనున్నట్లు వివరించారు. ఇది రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మార్గమని అన్నారు.
పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి కోసం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కాలుష్యం లేకుండా శుద్ధమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం ముందంజలో ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications