రెచ్చగొట్టొద్దు: కెసిఆర్‌కు బాబు, టీడీపీలోకి టీ 'జగన్' నేత
హైదరాబాద్: ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విద్వేషాలను రెచ్చగొట్టడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హితవు పలికారు. విభజన తర్వాత తెలుగు జాతి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేయాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలన్నారు.
రాజకీయ స్వార్థం కోసం తెలుగు జాతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టుకుంటే నష్టపోతామని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలన్నారు.

మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మహ్మద్ మొహీనుద్దీన్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 2000 మంది నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెరాస ప్రభుత్వం మంచి పనులు చేస్తే పూర్తిగా సహకరిస్తామన్నారు. తెలంగాణలో సైతం విద్యుత్ కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విన్నవించానన్నారు. తెలుగు ప్రజలంతా ఒక్కటనే టీడీపీ భావిస్తుందన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications