వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, తెలంగాణా గవర్నర్ తమిళిసై!!
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. దీపావళి పండుగ ఆదివారమా, సోమవారమా అని ప్రతీ ఒక్కరు ఆలోచిస్తున్న సమయంలో దీపావళి పండుగ ఆదివారమే జరుపుకోవాలని పలువురు పండితులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే దీపావళిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి ఒక్కరు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్షించారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసిన జగన్ చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానం పై జ్ఞానం, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అని పేర్కొన్నారు.

దీపావళి పండుగ సందర్భంగా సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని కోరుకుంటున్నానని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు .
ఈ దీపాల పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆధునిక కాలపు దురాచారాలను జయించి శాంతి, సామరస్యం, మత సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి పండుగలు స్ఫూర్తిని ఇస్తాయని తాను కచ్చితంగా అనుకుంటున్నానని తమిళిసై తెలిపారు.ప్రజలంతా పండుగల సమయంలో తమ చుట్టూ ఉన్నవారి సంతోషం కోసం పాటు పడాలన్నారు.
ఆత్మ నిర్భర భారత్ యొక్క నిజమైన స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని, ఈ పండుగకు ప్రతి ఒక్కరు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆమె అన్నారు. ఈ దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాలలో వెలుగును, సంతోషం, శ్రేయస్సు ,కొత్త ఆలోచనలను తీసుకురావాలని గవర్నర్ తమిళిసై తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications