జగనన్న దావోస్ వెళ్లలేదు? లండన్ వెళ్లారు??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటనకు దావోస్ బయలుదేరిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో సతీసమేతంగా బయలుదేరిన జగన్ షెడ్యూల్ ప్రకారం దావోస్ వెళ్లలేదని, లండన్ వెళ్లారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యమంత్రితో పర్యటించిన ప్రత్యేక బృందం మాత్రం దావోస్ చేరుకుంది. జగన్మోహన్‌రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. దావోస్ వెళ్లడానికి అనుమతి తీసుకున్న జగన్ లండన్ వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వ్యాపార వ్యవహారాలమీద వెళ్లారా? ప్రభుత్వ పనిమీద లండన్ వెళ్లారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా లండన్ లోనే ఉన్నారు. అక్కడ ఆయన పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. అధికారికంగా సమాచారం ఉంటే జగన్ కూడా ఆయా సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం మీడియాకు అందలేదు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లో విస్త్రతంగా ఉన్న తీర ప్రాంతం గురించి, ఇతర మౌలిక సౌకర్యాల గురించి వివరించి పెట్టబడులను ఆకర్షించే లక్ష్యంతో జగన్ దావోస్ వెళ్లాల్సి ఉంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ పెట్టుబడులు వస్తాయని ముందే ఆశతో ఉండొద్దంటూ ప్రజలకు స్పష్టం చేశారు. లండన్ నుంచి జగన్ దావోస్ చేరుకున్న తర్వాతే అధికారిక సమాచారం అందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications